మీడియాకు ఎక్కితే ఖబడ్దార్...
- రాజీ కుదుర్చుకో...లేదంటే తిప్పలు తప్పవ్
- లైంగిక వేధింపుల బాధితురాలికి ఎస్‌ఐ వార్నింగ్
సాక్షి, సిటీబ్యూరో: లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు ఈ విషయంపై పత్రికలకు ఎక్కితే తీవ్ర పరిణామాలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించాడు. పంజగుట్ట డివిజన్‌లోని ఓ పోలీసుస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడితో రాజీ కుదుర్చుకోవాలని, లేకపోతే తిప్పలు తప్పవని ఆయన బెదిరించాడు. మాజీ పోలీసు అధికారి తనకు చేసిన అన్యాయంతో కృంగిపోతున్న ఆ బాధితురాలు ఎస్‌ఐ తాజా హెచ్చరికలతో తీవ్ర ఆవేదనకు గురవుతోంది.
వివరాలు... మాజీ పోలీసు అధికారి లైంగిక వే ధింపులు భరించలేని బాధితురాలు ముందుగా ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేస్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆమె రెండు రోజుల క్రితం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మాజీ పోలీసు అధికారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇది జీర్ణించుకోలోని సదరు అధికారి మరోసారి ఆమెపై దాడి చేసి గాయపర్చాడు.
ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలికి మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. అక్కడున్న ఓ ఎస్‌ఐ కేసు రాజీ చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. మరో అడుగు ముందుకేసిన ఆయన ఈ విషయంపై మరోసారి మీడియాకు వెళ్తే నీ అంతు చూస్తానని తీవ్ర పదజాలంలో హెచ్చరించాడు.
బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. ఆమెనే ఇబ్బందులకు గురి చేసిన సదరు ఎస్‌ఐ వ్యవహార శైలి పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై నగర పోలీసు కమిషనర్ ఆరా తీస్తున్నట్ట తెలిసింది.