న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. వాళ్ల మీద గనుక పోలీస్ కేసులు నమోదు అయితే వాటికి క్లియరెన్స్ ఉండబోదని, భవిష్యత్తులో ఆర్మీలో చేరే అవకాశం ఉండదని హెచ్చరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి.
అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొనే డిఫెన్స్ ఉద్యోగ ఔత్సాహికులు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్తతలను తాము అస్సలు ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ తరహా హింసను ఖండిస్తున్నాం. ఇది అసలు పరిష్కారం కాదు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో చివరి దశ.. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటారో.. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో క్లియరెన్స్ రాదు.. ఆర్మీలో చేరే తలుపులు మూసుకుపోతాయ్. గుర్తుపెట్టుకోండి’’ అని హెచ్చరించారు మార్షల్ వీఆర్ చౌదరి.
అగ్నిపథ్ పథకం ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించిన ఆయన.. అభ్యర్థుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే దగ్గర్లోని మిలిటరీ స్టేషన్‌లకు వెళ్లి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సింది సరైన సమాచారం తెలుసుకోవడం.. అగ్నిపథ్ గురించి కూలంకశంగా తెలుసుకోవడం. కలిసొచ్చే అంశాలను, లాభాల గురించి కూడా తెలుసుకోవాలి.. అంతేకానీ ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పారాయన.
అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైన మార్పులు చేర్పులకు అవకాశాలు లేకపోలేదని మాత్రం స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్ నియామకాలు జూన్ 24వ తేదీ నుంచి మొదలు అవుతాయని మరోసారి ప్రకటించారు ఎయిర్‌స్టాఫ్ చీఫ్.
Comments
Please login to add a commentAdd a comment