army recruitments
-
Agnipath Scheme: ఆరని అగ్గి
న్యూఢిల్లీ: సైన్యంలో నియామకాల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశమంతటా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శనివారం సైతం ఆందోళనలు కొనసాగాయి. పలుచోట్ల హింసాకాండ చోటుచేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో యువత రోడ్లు, రైలు పట్టాలపై బైఠాయించారు. పుషప్‌లు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 369 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూశారు. బిహార్‌లో రైల్వేస్టేషన్‌కు నిప్పు బిహార్‌లో యువకులు బంద్‌కు పిలుపునిచ్చారు. తారేగానా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దానాపూర్‌లో అంబులెన్స్‌పై దాడికి దిగారు. అందులోని ముగ్గురిని తీవ్రంగా కొట్టారు. రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఔట్‌పోస్టుపై దాడిలో పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చాయి. కర్ణాటకలోని ధార్వాడలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బెంగాల్లో రైలు పట్టాల దిగ్బంధం పశ్చిమ బెంగాల్లో శనివారం కూడా నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్నిపథ్ వద్దంటూ యువకులు పట్టాలపైనే పుషప్స్ చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ నినదించారు. ఆర్మీలో చేరేందుకు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేరళలో భారీ నిరసన ర్యాలీలు కేరళలో నిరసనలు హోరెత్తాయి. ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేసుకొని ఫలితాల కోసం చూస్తున్న యువకులు తిరువనంతపురం, కోజికోడ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అగ్నిపథ్‌తో తమ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పుషప్స్ చేశారు. పథనంథిట్టలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు గాయపడ్డారు. యూపీలో 400 మందిపై కేసులు యూపీలో మీరట్, జాన్పూర్, కన్నౌజ్‌లో యువకులు నిరసన కొనసాగించారు. బస్సులు తగలబెట్టారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బైఠాయించారు. బలియా, అలీగఢ్, గౌతమ్‌బుద్ధ నగర్, వారణాసి తదితర 17 ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన 109 మందిని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లూథియానా రైల్వేస్టేషన్లో బీభత్సం హరియాణాలోని మహేందర్‌గఢ్‌లో ఆందోళనకారులు ఓ వాహనాన్ని తగలబెట్టారు. సోనిపట్, కైతాల్, ఫతేబాద్, జింద్‌లో భారీ నిరసనలకు దిగారు. రోహ్తక్–పానిపట్ హైవేను దిగ్బంధించారు. పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. కిటికీల అద్దాలను, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. రాజస్తాన్‌లోని జైపూర్, జోద్పూర్లోనూ వందలాదిగా రోడ్లపైకి వచ్చారు. అల్వార్‌లో జైపూర్–ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఓ బస్సును ధ్వంసం చేశారు. చిదావాలో పట్టాలపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
Agnipath: నిరసనకారులకు కేసుల క్లియరెన్స్ ఉండదు..జాగ్రత్త
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. వాళ్ల మీద గనుక పోలీస్ కేసులు నమోదు అయితే వాటికి క్లియరెన్స్ ఉండబోదని, భవిష్యత్తులో ఆర్మీలో చేరే అవకాశం ఉండదని హెచ్చరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొనే డిఫెన్స్ ఉద్యోగ ఔత్సాహికులు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్తతలను తాము అస్సలు ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ తరహా హింసను ఖండిస్తున్నాం. ఇది అసలు పరిష్కారం కాదు. ఆర్మీ రిక్రూట్మెంట్లో చివరి దశ.. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటారో.. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో క్లియరెన్స్ రాదు.. ఆర్మీలో చేరే తలుపులు మూసుకుపోతాయ్. గుర్తుపెట్టుకోండి’’ అని హెచ్చరించారు మార్షల్ వీఆర్ చౌదరి. అగ్నిపథ్ పథకం ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించిన ఆయన.. అభ్యర్థుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే దగ్గర్లోని మిలిటరీ స్టేషన్లకు వెళ్లి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సింది సరైన సమాచారం తెలుసుకోవడం.. అగ్నిపథ్ గురించి కూలంకశంగా తెలుసుకోవడం. కలిసొచ్చే అంశాలను, లాభాల గురించి కూడా తెలుసుకోవాలి.. అంతేకానీ ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పారాయన. అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైన మార్పులు చేర్పులకు అవకాశాలు లేకపోలేదని మాత్రం స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్ నియామకాలు జూన్ 24వ తేదీ నుంచి మొదలు అవుతాయని మరోసారి ప్రకటించారు ఎయిర్‌స్టాఫ్ చీఫ్. చదవండి: అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!
న్యూఢిల్లీ: ఆసక్తి ఉన్న యువకులు, ఇతర యువ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన సైనికులుగా చేర్చుకునే సంచలన ప్రతిపాదనపై ఆర్మీ కసరత్తు చేస్తోంది. యుద్ధ పోరాట దళాలు సహా పలు విభాగాల్లో ఆఫీసర్, ఇతర హోదాల్లో మూడేళ్ల కాలపరిమితితో వారిని చేర్చుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. యువకులకు సైనిక జీవితాన్ని పరిచయం చేయడంతో పాటు సైన్యాన్ని ప్రజలకు దగ్గర చేసే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను రూపొందించారు. ‘ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. రెగ్యులర్ సెలక్షన్‌లాగానే ఉంటుంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 100 మంది అధికారులు, వెయ్యిమంది సైనిక సిబ్బందిని ఎంపిక చేసే అవకాశముంది. అయితే, ముందుగా ఈ ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది’ అని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ వెల్లడించారు. ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ లేదా ‘త్రీ ఈయర్ షార్ట్ సర్వీస్’ రిక్రూట్మెంట్ కార్యక్రమంలో ఏ వయసు వారిని పరిగణనలోకి తీసుకోవాలి? ఫిట్నెస్ స్థాయిలు ఎలా ఉండాలి? తదితర కీలక అంశాలపై కసరత్తు సాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం జాతీయ వాదం, దేశభక్తి ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో కాకుండా, తాత్కాలికంగా సైన్యంలో చేరాలనుకుంటున్న యువకులు లక్ష్యంగా ఈ పథకం రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నాయి. త్వరలో ఆర్మీ ఉన్నతస్థాయి కమాండర్లు పాల్గొనే ఒక కార్యక్రమంలో దీనిపై లోతుగా చర్చించనున్నట్లు వెల్లడించాయి. ఈ స్కీమ్‌లో రిక్రూట్ చేసుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లాంటి సౌకర్యాలేవీ ఉండవు కనుక ఆర్థికంగా ఇది లాభదాయకమని ఆర్మీ భావిస్తోందన్నాయి. పారామిలటరీ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్) నుంచి ఆసక్తి ఉన్నవారిని ఏడేళ్ల కాలపరిమితిలో సైన్యంలో చేర్చుకునే ప్రతిపాదనపై చర్చ నడుస్తోంది. తర్వాత∙వారు పాత సర్వీస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితితో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద యువతను ఆర్మీ రిక్రూట్ చేసుకుంటోంది. ఆ కాలపరిమితిని 14 ఏళ్ల వరకు పెంచవచ్చు. (కేంద్రం చేతికి విద్యుత్ రంగం) -
దేశం కోసం
కరీంనగర్‌స్పోర్ట్స్: దేశసేవకోసం యువత తరలివస్తోంది. ఆర్మీలో చేరడానికి తెలంగాణ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏడోరోజు ఆర్మీరిక్రూట్మెంట్ ర్యాలీ ముగిసింది. తెలంగాణలోని అన్నిజిల్లాల అభ్యర్థులకు సోల్జర్ క్లర్క్, ఎస్కేటీ, సోల్జర్నర్సింగ్ విభాగంలో ర్యాలీ నిర్వహించారు. 3,200మంది హాజరయ్యారు. 190మంది మెడికల్టెస్టుకు అర్హత సాధించారు. బుధవారం అదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ అభ్యర్థులకు సోల్జర్ట్రేడ్స్మెన్ విభాగంలో ర్యాలీ జరగనుంది. 4,951 మంది హాజరుకానున్నారు. 190మంది అర్హత సోల్జర్ క్లర్క్/ఎస్కెటీ, సోల్జర్నర్సింగ్ అసిస్టెంట్ విభాగానికి 4,632మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల ఎత్తు కొలవగా 3,200మంది రన్నింగ్‌కు అర్హత సాధించారు. వీరికి బ్యాచ్‌కు190 మంది చొప్పున 1600మీటర్ల రన్నింగ్ నిర్వహించగా జీపీ1, జీపీ2లలో కలిపి 190మంది అర్హత మెడికల్‌కు సాధించారు. ట్రైనీ ఐఏఎస్ పరిశీలన ఆర్మీ నియామక ర్యాలీని మంగళవారం ట్రైనీ ఐఏఎస్ ప్రావీణ్య సందర్శించారు. రన్నింగ్, డిచ్జంప్, పుల్అప్స్ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిక్రూట్మెంట్ డైరెక్టర్కల్నల్ పూరీ నియామకాల తీరును వివరించారు. కొనసాగుతున్న మెడికల్ టెస్టులు.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా మెడికల్ టెస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. శరీరంలో ఉన్నపుట్టు మచ్చలను మార్క్‌చేసి మెడికల్ టెస్టులకు పంపించారు. అర్ధరాత్రి స్టేడియంలో నిద్రిస్తున్న అభ్యర్థులు నేటి ర్యాలీ ఆర్మీ నియామకాల్లో భాగంగా బుధవారం అదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికి సోల్జర్ట్రేడ్స్మెన్ విభాగానికి ర్యాలీ జరగనుంది. దీనికి 4,951 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ నియామక అర్హత... శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 162 సెం.మీ, బరువు 50 కేజీలు, ఛాతీ 77 సెం.మీ, గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. నిర్వహించే పరీక్షలు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ): 1.6 కి.మీ దూరాన్ని జీపీ:1వారు 5 నిమిషాల 30 సెకండ్లలోపు. జీపీ 2 వారు 5 నిమిషాల 31 సెకండ్ల నుంచి 5 నిమిషాల 45 సెకండ్లలోగా చేరుకోవాలి. 9అడుగుల డిచ్ జంప్, కనీసం 6పుల్అప్స్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో నడవాలి. సోల్జర్ కావాలనే కోరిక... ఆర్మీలో చేరాలనేది నా కోరిక. చిన్నప్పటి నుంచి సైనికులంటే చాలా ఇష్టం. ఆర్మీ నియామకాల ర్యాలీ నోటిఫికేషన్‌కు ముందునుంచే సుమారు నాలుగు నెలలు సాధన చేశాను. ఇప్పుడు రన్నింగ్‌ను ఈజీగా చేశాను. – పి.నరేష్, మద్దూర్, మహబూబ్‌నగర్ నాన్న కోరిక తీర్చాలి మానాన్నకు సైనికులు అంటే ఇష్టం. ఆయన కోరిక నన్ను సైనికున్ని చేయాలని. అందుకే నెల రోజుల ముందు నుంచే సాధన చేయడం ప్రారంభించా. ఇప్పుడు మెడికల్‌కు అర్హత సాధించా. ఆర్మీలో సైనికుడిని అయ్యి నాన్న కోరిక నెరవేర్చుతా. – ఎం.నవీన్, నారాయణ గూడేం, నల్గొండ ఇది లాస్ట్ టైమ్... ఇప్పటికి పదిసార్లు ఆర్మీనియామక ర్యాలీలో పాల్గొన్నా. 7సార్లు పరీక్షలో ఫెయిల్ అయ్యా. రెండుసార్లు మెడికల్‌కు రిజక్ట్ అయ్యాను. ఇదిలాస్ట్. ఇప్పుడు మెడికల్‌కు అర్హత సాధించా. సైనికుడిగా ఎంపిక అవుతాన్న నమ్మకం ఉంది. – ఎం.నరేశ్, లింగాపూర్, అదిలాబాద్ లైఫ్ ఆంబీషన్.. ఆర్మీలో సైనికునిగా ఉండాలన్నది లైఫ్ ఆంబీషన్. చిన్నటినుంచే నిరంతర సాధన చేస్తున్నా. కరీంనగర్లో అర్హత సాధించా. మెడికల్ టెస్ట్‌కు అర్హత సాధించా. సైనికునిగా నిలుస్తానన్న నమ్మకం కలిగింది.– ధరావత్ శివరామ్,జల్లపల్లిఫరమ్, నిజామాబాద్ -
కొత్తగూడెంలో ఆర్మీరిక్రూట్ మెంట్లు
కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఏడు కేటగిరీల్లో జరుగనున్నఈ రిక్రూట్ మెంట్లకు తెలంగాణలోని 10 జిల్లాల అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కొత్తగూడెం చేరుకున్నారు. అధికారులు వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అభ్యర్థుల ఎత్తు, బరువు, ఛాతి కొలతలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఇతర పరీక్షలు ప్రకాశం స్టేడియంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ రిక్రూట్మెంట్లకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి.