న్యూఢిల్లీ: ఆసక్తి ఉన్న యువకులు, ఇతర యువ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన సైనికులుగా చేర్చుకునే సంచలన ప్రతిపాదనపై ఆర్మీ కసరత్తు చేస్తోంది. యుద్ధ పోరాట దళాలు సహా పలు విభాగాల్లో ఆఫీసర్, ఇతర హోదాల్లో మూడేళ్ల కాలపరిమితితో వారిని చేర్చుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. యువకులకు సైనిక జీవితాన్ని పరిచయం చేయడంతో పాటు సైన్యాన్ని ప్రజలకు దగ్గర చేసే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను రూపొందించారు. ‘ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. రెగ్యులర్ సెలక్షన్‌లాగానే ఉంటుంది.
తొలి దశలో ప్రయోగాత్మకంగా 100 మంది అధికారులు, వెయ్యిమంది సైనిక సిబ్బందిని ఎంపిక చేసే అవకాశముంది. అయితే, ముందుగా ఈ ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది’ అని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ వెల్లడించారు. ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ లేదా ‘త్రీ ఈయర్ షార్ట్ సర్వీస్’ రిక్రూట్‌మెంట్ కార్యక్రమంలో ఏ వయసు వారిని పరిగణనలోకి తీసుకోవాలి? ఫిట్‌నెస్ స్థాయిలు ఎలా ఉండాలి? తదితర కీలక అంశాలపై కసరత్తు సాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం జాతీయ వాదం, దేశభక్తి ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో కాకుండా, తాత్కాలికంగా సైన్యంలో చేరాలనుకుంటున్న యువకులు లక్ష్యంగా ఈ పథకం రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
త్వరలో ఆర్మీ ఉన్నతస్థాయి కమాండర్లు పాల్గొనే ఒక కార్యక్రమంలో దీనిపై లోతుగా చర్చించనున్నట్లు వెల్లడించాయి. ఈ స్కీమ్‌లో రిక్రూట్ చేసుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లాంటి సౌకర్యాలేవీ ఉండవు కనుక ఆర్థికంగా ఇది లాభదాయకమని ఆర్మీ భావిస్తోందన్నాయి. పారామిలటరీ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్) నుంచి ఆసక్తి ఉన్నవారిని ఏడేళ్ల కాలపరిమితిలో సైన్యంలో చేర్చుకునే ప్రతిపాదనపై చర్చ నడుస్తోంది. తర్వాత∙వారు పాత సర్వీస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితితో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద యువతను ఆర్మీ రిక్రూట్ చేసుకుంటోంది. ఆ కాలపరిమితిని 14 ఏళ్ల వరకు పెంచవచ్చు. (కేంద్రం చేతికి విద్యుత్ రంగం)
Comments
Please login to add a commentAdd a comment