
న్యూఢిల్లీ: సైన్యంలో నియామకాల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశమంతటా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శనివారం సైతం ఆందోళనలు కొనసాగాయి. పలుచోట్ల హింసాకాండ చోటుచేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో యువత రోడ్లు, రైలు పట్టాలపై బైఠాయించారు. పుషప్‌లు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 369 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూశారు.
బిహార్‌లో రైల్వేస్టేషన్‌కు నిప్పు
బిహార్‌లో యువకులు బంద్‌కు పిలుపునిచ్చారు. తారేగానా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దానాపూర్‌లో అంబులెన్స్‌పై దాడికి దిగారు. అందులోని ముగ్గురిని తీవ్రంగా కొట్టారు. రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఔట్‌పోస్టుపై దాడిలో పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చాయి. కర్ణాటకలోని ధార్వాడలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
బెంగాల్‌లో రైలు పట్టాల దిగ్బంధం
పశ్చిమ బెంగాల్‌లో శనివారం కూడా నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్నిపథ్ వద్దంటూ యువకులు పట్టాలపైనే పుషప్స్ చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ నినదించారు. ఆర్మీలో చేరేందుకు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.
కేరళలో భారీ నిరసన ర్యాలీలు
కేరళలో నిరసనలు హోరెత్తాయి. ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ పూర్తి చేసుకొని ఫలితాల కోసం చూస్తున్న యువకులు తిరువనంతపురం, కోజికోడ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అగ్నిపథ్‌తో తమ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పుషప్స్ చేశారు. పథనంథిట్టలో ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు గాయపడ్డారు.
యూపీలో 400 మందిపై కేసులు
యూపీలో మీరట్, జాన్‌పూర్, కన్నౌజ్‌లో యువకులు నిరసన కొనసాగించారు. బస్సులు తగలబెట్టారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బైఠాయించారు. బలియా, అలీగఢ్, గౌతమ్‌బుద్ధ నగర్, వారణాసి తదితర 17 ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన 109 మందిని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
లూథియానా రైల్వేస్టేషన్‌లో బీభత్సం
హరియాణాలోని మహేందర్‌గఢ్‌లో ఆందోళనకారులు ఓ వాహనాన్ని తగలబెట్టారు. సోనిపట్, కైతాల్, ఫతేబాద్, జింద్‌లో భారీ నిరసనలకు దిగారు. రోహ్‌తక్–పానిపట్ హైవేను దిగ్బంధించారు. పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. కిటికీల అద్దాలను, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. రాజస్తాన్‌లోని జైపూర్, జోద్‌పూర్‌లోనూ వందలాదిగా రోడ్లపైకి వచ్చారు. అల్వార్‌లో జైపూర్–ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఓ బస్సును ధ్వంసం చేశారు. చిదావాలో పట్టాలపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment