సాక్షి, హైదరాబాద్: ఆందోళనకారుల చూపు ఆ భవనంపై పడి ఉంటే సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే నిర్వహణ వ్యవస్థ ఓ నెలరోజులు పూర్తిగా కుప్పకూలి ఉండేది. దాన్ని పునరు ద్ధరించే వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగేది. కొద్ది రోజులపాటు కొన్ని రైళ్లను పూర్తిగా నిలిపేయాల్సి వచ్చేది. ఆ భవనానికి అతి చేరువగా వెళ్లిన ఆందోళనకారులు, దానికి నష్టం కలిగించకపోవటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ భవనమే ఆర్‌ఆర్‌ఐ. సికింద్రాబాద్ స్టేషన్ ఐదు మార్గాలతో అనుసంధానమై ఉంది. నాంపల్లి, లింగంపల్లి, మల్కాజిగిరి, సీతాఫల్‌మండి, కాచిగూడ మార్గాల ద్వారా నిరంతరం స్టేషన్‌లోకి రైళ్లు వచ్చిపోతుంటాయి.
స్టేషన్‌లో ఉన్నవి పది ప్లాట్‌ఫామ్‌లే. ఐదు వైపుల నుంచి రైళ్లు రావటం, స్టేషన్ నుంచి ఆ ఐదు వైపులకు రైళ్లు వెళ్లటం... ట్రాక్ అనుసంధానం చాలా గజిబిజిగా ఉంటుంది. ఏ రైలు ఎక్కడ ఏ పట్టాలు మారి దిశను మార్చుకోవాలో సాంకేతిక సిబ్బంది నిరంతరం పర్యవేక్షి స్తుంటారు. ఈ పనులు మాన్యువల్‌గా కాకుండా, సాంకేతిక వ్యవస్థ ఆధారంగా జరుగుతుంది. దాన్ని నిర్వహించేదే రూట్ రిలే ఇంటర్‌లాకింగ్(ఆర్‌ఆర్‌ఐ) వ్యవస్థ. ఆ భవనంలో ఆర్‌ఆర్‌ఐ వ్యవస్థ ఉంది. ఆర్‌ఆర్‌ఐ వివరాలు కంప్యూటర్ ఆధారితం గా డిస్‌ప్లే అవుతుంటాయి. రైళ్లు ట్రాక్ మారే అంశాలన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఓ బటన్ నొక్కటం ద్వారా ఈ వ్యవస్థ సజావుగా సాగిపోతుంది.
దానిని ధ్వంసం చేసి ఉంటే..: రైలు ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సాయాన్ని అందించే రైలుపై కూడా ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ఆ మెడికల్ రిలీఫ్ వ్యాన్ పక్కనే ఆర్‌ఆర్‌ఐ భవనం ఉంది. దీన్ని ధ్వంసం చేసి ఉంటే, మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలి ఉండేది. ఐదు మార్గాలతో అనుసంధానమై ఉన్న దాన్ని బాగు చేసేందుకు కనీసం నెలరోజుల సమయం పట్టి ఉండేదని అధికారులు చెబుతున్నారు. రోజుకు 150 రైళ్లు వచ్చిపోయే సికింద్రాబాద్ స్టేషన్‌లో, ఈ వ్యవస్థ ధ్వంసమై ఉంటే.. మాన్యువల్‌గా ట్రాక్‌ను మార్చి అన్ని రైళ్లను నడపటం అసాధ్యం. అప్పుడు కొన్ని రైళ్లును పునరుద్ధరణ పూర్తయ్యే వరకు నిలిపివేయాల్సి వచ్చేది.
చదవండి: Agnipath scheme : అగ్గి పథం
Comments
Please login to add a commentAdd a comment