సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్‌ఫామ్‌లపైకి చేరి.. విధ్వంసం మొదలుపెట్టారు. సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు సికింద్రాబాద్‌కు పోటెత్తడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితికి పోలీసులు చేరుకున్నారు. ఒక్కసారిగా విరుచుకుపడిన విద్యార్థులతో రైల్వే స్టేషన్ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది. అరగంట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో మాడిమసయ్యాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసే క్రమంలో.. పోలీసులు పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. పార్సిల్ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
►రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభం కానున్నాయి: డీఆర్‌ఎమ్ గుప్తా
►రైళ్ల రాకపోకల్లో మార్పుల్ని ఐఆర్‌సీటీసీలో అప్‌డేట్ చేస్తాం
►రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు పూర్తిగా సామాగ్రిని ధ్వంసం చేశారు
►ఇప్పటివరకూ ఏడు కోట్ల వరకూ నష్టం
►గతంలో ఇలాంటి ఆందోళనలు ఎప్పుడు జరగలేదు
►7 లోకోమోటివ్ ఇంజిన్లు ధ్వంసం
►30 బోగీలు పాక్షికంగా ధ్వంసం
►పలు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
►రైల్వే సిబ్బంది అంతా సురక్షితం: డీఆర్‌ఎమ్ గుప్తా
► కాసేపట్లో మెట్రో సర్వీసులు ప్రారంభం
►ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు
►ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
►ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నాం: అడిషనల్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్
►ఆందోళనకారులను తరలించేందుకు రంగం సిద్ధం
►రైల్వే స్టేషన్‌లో అదనపు బలగాల మోహరింపు
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
►రైల్వే స్టేషన్‌లోనే చర్చలకు సిద్ధమంటున్న ఆందోళనకారులు
►రైల్వే స్టేషన్‌కు వచ్చేందుకు ఆర్మీ అధికారులు నిరాకరణ
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై కూర్చొని యువకుల నిరసనలు.. రాకేష్ మృతదేహాన్ని ఇక్కడ తీసుకురావాలని డిమాండ్.
► తాము చావడానికైనా సిద్దంగా ఉన్నామని, కేంద్రం హామీ ఇచ్చేవరకూ ఇక్కడ నుంచి కదిలేదే లేదని ఆందోళన కారులు స్పష్టం చేశారు. ఆందోళనకారులు ఆవేశం తగ్గించుకుని ఆలోచించుకోవాలని పోలీసులు కోరగా, ఆందోళన విరమించేదే లేదని వారు తేల్చిచెప్పారు.
► పది మందిని చర్చలకు పిలిచిన పోలీసులు.. అంతా వస్తామని అంటున్న నిరసనకారులు.
► అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్ చేశారు.
► అగ్నిపథ్ వంటి పథకాలు దేశంలో చాలా ఉన్నాయి. అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. సికింద్రాబాద్ ఘటన పథకం ప్రకారమే కుట్రచేసి విధ్వంసం సృష్టించారు. ఇది బలవంతపు ట్రైనింగ్ కాదు, స్వచ్చందంగా సైన్యంలో చేరవచ్చు
- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
►గురువారం రాత్రే సుమారు 500 మంది నిరసనకారులు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. రైళ్లను ఆపేసి ఆందోళన వ్యక్తం చేయాలనుకున్నారు. అయితే పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగడంతో విధ్వంసం చేపట్టారు. సదరు వాట్సాప్ గ్రూప్‌పై ఇప్పుడు రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.
► సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు హింహిత్మకంగా మారడంతో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని అధికారులు సూచించారు
►తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
►అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది.
►కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటనపై వివరాలను అమిత్‌షాకు వివరించారు. కొన్ని రాజకీయ పార్టీల అండతోనే విధ్వంసం జరిగిందని వెల్లడించినట్లు సమాచారం
►సికింద్రాబాద్‌లో ఆందోళన నేపథ్యంలో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను పోలీసులు మూసేశారు. ప్రయానికులు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను పూర్తిగా తమ ఆదినంలోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌లో ఫైర్ ఇంజన్‌లను అందుబాటులో ఉంచారు.
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నెలకొన్న విధ్వంసకర పరిస్థితి నేపథ్యంలో విశాఖపట్నంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ రైల్వే స్టేషన్‌కు భద్రతను భారీగా పెంచారు. ఎవరూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని మైక్‌లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. కేసులను ఎదుర్కొని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
►ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పార్శిల్ రైలుతో పాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో 2 బోగిలు దగ్ధం అయ్యాయని, 40 బైక్‌లు కూడా ధ్వంసం చేశారని రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు. 44 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు.
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు 15 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతిచెందాడు.
►సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే రైల్వేస్టేషన్‌లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రక్తసిక్తంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వుతున్నారు.
►సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనకు ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ చేస్తుందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.
►ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. మూడు ప్లాట్‌ఫామ్‌లలో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. 20 బైక్‌లకు నిప్పు పెట్టారు.
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద విద్యార్థులు బైఠాయించారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. ప్యాసింజర్ రైలు, పార్మీల్ బోగీలకు, స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పు పెట్టారు.
►రైళ్లపై రాళ్లు విసరడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
►అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ఇక నిరసనకారుల ఆందోళనతో అధికారులు రైళ్లను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment