ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొ. పాపిరెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో నంబర్ 8 జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1988 ప్రకారం ఆయన్ని నియమించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు మండలి ఏర్పాటుపై ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేస్తూ మరో జీవో జారీ చేశారు. దీని ప్రకారం ఈనెల 5 నుంచి తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారికంగా ఏర్పాటు అయింది. ఇందులో చేపట్టే నియామకాలు 5వ తేదీ నుంచే వర్తిస్తాయి. చైర్మన్‌గా పాపిరెడ్డిని నియమించగా, ఒక వైస్ చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా విద్యా, ఆర్థిక శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శులు, ఇతర వర్సిటీల వీసీలు ఉంటారు.
విద్యార్థులు ఆందోళన చెందవద్దు : పాపిరెడ్డి
ఉన్నత విద్యమండలి చైర్మన్‌గా నియమాకమైన సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనా చెందవద్దన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా చేపడతామన్నారు.
ఉద్యమం నుంచి..
హన్మకొండ : పాపిరెడ్డి వరంగల్ జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఈ ఏడాది జూన్ లో రిటైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవునూర్ ఆయన స్వగ్రామం.
ప్రస్తుత మండలికి లేఖ: తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చైర్మన్‌ను నియమించినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ మండలికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అందులో పేర్కొంది.