పరకాల పేదల కల నెరవే‘రే’
రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద మూడు కాలనీల ఎంపిక
రూ. 5లక్షలతో అందమైన సొంతిల్లు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
పరకాల :పరకాల పట్టణంలోని మురికివాడలకు మహర్దశ పట్టనుంది. స్లమ్ ఫ్రీ సిటీ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్‌ఏవై) పథకానికి పరకాల నగర పంచాయతీలోని మూడు మురికివాడలు ఎంపికయ్యూరుు. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేలో తొమ్మిది కాలనీలను మురికివాడలు(నోటిఫైడ్ స్లమ్స్) గుర్తించినప్పటికీ అందులో మొదటి దశలో మూడు కాలనీల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
మురికివాడలు లేని పట్టణాలు, నగరాలను నిర్మించే లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఎలాంటి వసతులు లేని మురికివాడల్లో ప్రజలు ఉండడానికి ఇళ్లు, రోడ్లు, మం చి నీటితోపాటు మౌళిక వసతులన్ని కల్పించడమే ఈ పథకం ముఖ్యోద్ధేశము. ఇందులో భాగం గా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ము నిసిపల్ ఏరియాస్(మెప్మా) పరిధిలో పని చేసే పట్టణ మహిళ సమాఖ్యతో ఈ ఏడాది జనవరి లో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పట్టణంలోని హరిజనవాడ(కొత్తకాలనీ), బీసీ కాలనీ, రాజీపేట ఎస్సీ కాలనీ, వడ్లవాడ, కుమ్మరివాడ, వెలుమ, గౌడవాడ, మా దారం హరిజనవాడ, గండ్రవాడ, మోరేవాడ ను మురికివాడల కింద గుర్తించారు. అంతేగాక అప్పటి మెప్మా ఏఎండీ కే. విద్యాధర్ జనవరి 23న నగర పంచాయతీని సందర్శించి స్థాని కుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మూడు కాలనీలు ఎంపిక
సర్వే, అధికారుల పర్యటన అనంతరం పట్టణంలోని మూడు కాలనీలు ఈ పథకం అమలుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ కాలనీ, సీఎస్‌ఐ, హరిజనవాడల్లో రే పథకం కింద గృహాలను నిర్మించడానికి ఎంపిక చేశారు. బీసీ కాలనీలో 338, సీఎస్‌ఐ, హరిజనవాడల్లో 380 గృహాలు నిర్మించనున్నారు. ఒక్క గృహానికి రెండు బెడ్‌రూంలు, హాల్, కిచెన్ గదులు ఉండేలా నిర్మాణం చేస్తారు. ఎంపికైన ఆ మూడు కాలనీల్లో ఒకే తీరులో ఉండే గృహాలు, రోడ్లు, తాగునీటి వసతి, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు.
మరో రెండు మూడు నెలల్లో నిర్మాణాలను చేపట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు. రే పథకం ప్రారంభిస్తే పట్టణ రూపురేఖల్లో మార్పులు కన్పిస్తాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.5 లక్షలు కాగా.. ఇందులో కేంద్రం వాటా రూ.3.75 లక్షలు(75%), రాష్ట్రం వాటా రూ.75 వేలు((15%), లబ్ధిదారుడి వాటా రూ.50 వేలు(10%) ఉంటుంది.
చాలా సంతోషంగా ఉంది
రే పథకం కింద మా కాలనీ ఎంపిక కావడం ఆనందంగా ఉంది. 30 ఏళ్ల నుంచి బీసీ కాలనీ అభివృద్ధికి దూరంగా ఉంది. ప్రభుత్వం రెండు వందల గజాల చొప్పున ఉచితంగా స్థలం, గృహాలు నిర్మించి ఇచ్చింది. గతంలో నిర్మించిన ఇల్లు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు రే పథకం కింద మోడల్ కాలనీ కోసం ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉంది.
- అల్లె దశరథం, కౌన్సిలర్, బీసీ కాలనీ