సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తుందని భావించిన మెట్రో రైలు నగరవాసులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. చాలా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. స్టేషన్ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్ చేస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వద్ద గురువారం వాహనాలను ఇష్టమొచ్చినట్టుగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను అక్కడి నుంచి తరలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అమీర్‌పేట స్టేషన్‌లో పార్కింగ్ వసతి కల్పించకపోవడం పట్ల జనం మండిపడుతున్నారు. చాలీస్ కమాన్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించినా, ఇంకా అమల్లోకి రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.
చాలా స్టేషన్లలో వాహనాలు నిలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సివస్తోంది. పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేదు. నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండగా.. కార్లు, బస్సులు, క్యాబ్స్ నిలిపేందుకు స్థలం లేదు. కొన్ని స్టేషన్లలో నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండటంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది.
పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పార్కింగ్ చార్జీలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మెట్రోరైలు ప్రయాణ చార్జీలు ఎక్కువేమీ లేవని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment