సమ్మె పాక్షికం
దేశంలోని బొగ్గు పరిశ్రమలను, బొగ్గు బ్లాక్‌లను దొడ్డిదారిన ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పేర్కొంటూ జాతీయ కార్మిక సంఘాలు మంగళవారం నుంచి చేపట్టిన సమ్మె సింగరేణిలో పాక్షికంగా జరిగింది. సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌తో పాటు ఆయా ఏరియాల్లో ప్రాతినిథ్య సంఘమైన హెచ్‌ఎంఎస్ దూరంగా ఉండటంతో సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు.
కార్మికులు యథావిధిగా ఉదయం షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యారు. కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేసేందుకు ఉదయమే గనుల వద్దకు చేరుకున్న జాతీయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విధులకు అంతరాయం కలుగకుండా గనులపై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని ఆయా గనుల్లో బొగ్గు ఉత్పత్తి కొనసాగింది.
-గోదావరిఖని
గోదావరిఖని:
రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1 డివిజన్‌లో 66 శాతం, ఆర్జీ-2 డివిజన్‌లో 73 శాతం, ఆర్జీ-3 డివిజన్‌లో 75 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆర్జీ-1లో ఉదయం షిప్టులో 4,180 మందికి 2,738 మంది, ఆర్జీ-2లో 2,700 మందికి 1974 మంది, ఆర్జీ-3లో 1670 మందికి 1256 మంది, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు ఏరియాలో 1672 మందికి 979 మంది విధులకు వెళ్లారు.
రెండవ షిప్టులో ఆర్జీ-1 ఏరియాలో 1313 మందికి 856 మంది, ఆర్జీ-2లో 905 మందికి 393 మంది, ఆర్జీ-3లో 1418 మందికి 1042 మంది విధులకు హాజరయ్యారు. బొగ్గు ఉత్పత్తిని పరిశీలిస్తే.. ఆర్జీ-1 ఏరియాలో 7,238 టన్నులకు 6,741 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 5,242 టన్నులను రవాణా చేయగలిగారు.
నాయకుల అరెస్టు..
జాతీయ సంఘాల నాయకులు ఉదయమే గనులపైకి చేరుకొని కార్మికులను సమ్మెకు సమాయత్తం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు జీడీకే-1వ గని వద్ద విధులకు హాజరవుతున్న కార్మికులను అడ్డుకుంటున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, ఆర్జీ-1 అధ్యక్షుడు టి.నరహరిరావు, ఐఎన్‌టీయూసీ ప్రధానకార్యదర్శి ఎస్.నర్సింహారెడ్డి, నాయిని మల్లేశ్, ఏఐటీయూసీ ఆర్జీ-1 కార్యదర్శి మడ్డి ఎల్లయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇ.నరేష్‌లను అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వారి అరెస్టును నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ మూలమలుపు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇందులో వివిధ సంఘాలకు చెందిన నాయకులు వై.గట్టయ్య, టుంగుటూరి కొమురయ్య, ఎం.దయాకర్‌రెడ్డి, సదానందం, కృష్ణమూర్తి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు..
సమ్మె ఈనెల 10వ తేదీ వరకు కొనసాగనుండగా, గనులు, ప్రాజెక్టులపై పోలీసులను పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, భద్రయ్య తదితరులు పర్యవేక్షించారు. హెచ్‌ఎంఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వర్తించారు. సోమవారం రాత్రి పూట విధులకు హాజరైన 36 మంది ఈపీ ఆపరేటర్లను ముందు జాగ్రత్తగా ఓసీపీ-3 బేస్‌వర్క్‌షాప్‌లో అదుపులో ఉంచుకున్నారు.
కానీ హాజరు శాతం పెరగడంతో వారిని సాయంత్రం పంపించివేశారు. 2013లో జరిగిన సకలజనుల సమ్మె తర్వాత జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వగా, దానికి కార్మికుల నుంచి ఆశించిన స్పందన కానరాలేదు. గుర్తింపు సంఘం సమ్మె విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడడం వల్లనే సమ్మె పాక్షికంగా జరిగిందని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.