The strike
-
వీఆర్ఏలు సమ్మెలో పాల్గొనాలి
హన్మకొండ అర్బన్ : సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు (డీఆర్) గురువారం నుంచి సమ్మెలో పాల్గొనాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ పిలుపునిచ్చారు. సమ్మెను పురస్కరించుకుని హన్మకొండలోని ఏకశిలా పార్కులో బుధవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగించాలన్నారు. వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు సతీష్, దేవిక, యాకయ్య, చంద్రకాంత్, సురేష్ పాల్గొన్నారు. -
సమ్మె పాక్షికం
దేశంలోని బొగ్గు పరిశ్రమలను, బొగ్గు బ్లాక్‌లను దొడ్డిదారిన ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పేర్కొంటూ జాతీయ కార్మిక సంఘాలు మంగళవారం నుంచి చేపట్టిన సమ్మె సింగరేణిలో పాక్షికంగా జరిగింది. సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌తో పాటు ఆయా ఏరియాల్లో ప్రాతినిథ్య సంఘమైన హెచ్ఎంఎస్ దూరంగా ఉండటంతో సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. కార్మికులు యథావిధిగా ఉదయం షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యారు. కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేసేందుకు ఉదయమే గనుల వద్దకు చేరుకున్న జాతీయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విధులకు అంతరాయం కలుగకుండా గనులపై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని ఆయా గనుల్లో బొగ్గు ఉత్పత్తి కొనసాగింది. -గోదావరిఖని గోదావరిఖని: రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1 డివిజన్లో 66 శాతం, ఆర్జీ-2 డివిజన్లో 73 శాతం, ఆర్జీ-3 డివిజన్లో 75 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆర్జీ-1లో ఉదయం షిప్టులో 4,180 మందికి 2,738 మంది, ఆర్జీ-2లో 2,700 మందికి 1974 మంది, ఆర్జీ-3లో 1670 మందికి 1256 మంది, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాలో 1672 మందికి 979 మంది విధులకు వెళ్లారు. రెండవ షిప్టులో ఆర్జీ-1 ఏరియాలో 1313 మందికి 856 మంది, ఆర్జీ-2లో 905 మందికి 393 మంది, ఆర్జీ-3లో 1418 మందికి 1042 మంది విధులకు హాజరయ్యారు. బొగ్గు ఉత్పత్తిని పరిశీలిస్తే.. ఆర్జీ-1 ఏరియాలో 7,238 టన్నులకు 6,741 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 5,242 టన్నులను రవాణా చేయగలిగారు. నాయకుల అరెస్టు.. జాతీయ సంఘాల నాయకులు ఉదయమే గనులపైకి చేరుకొని కార్మికులను సమ్మెకు సమాయత్తం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు జీడీకే-1వ గని వద్ద విధులకు హాజరవుతున్న కార్మికులను అడ్డుకుంటున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, ఆర్జీ-1 అధ్యక్షుడు టి.నరహరిరావు, ఐఎన్టీయూసీ ప్రధానకార్యదర్శి ఎస్.నర్సింహారెడ్డి, నాయిని మల్లేశ్, ఏఐటీయూసీ ఆర్జీ-1 కార్యదర్శి మడ్డి ఎల్లయ్య, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇ.నరేష్‌లను అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టును నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ మూలమలుపు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇందులో వివిధ సంఘాలకు చెందిన నాయకులు వై.గట్టయ్య, టుంగుటూరి కొమురయ్య, ఎం.దయాకర్‌రెడ్డి, సదానందం, కృష్ణమూర్తి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు.. సమ్మె ఈనెల 10వ తేదీ వరకు కొనసాగనుండగా, గనులు, ప్రాజెక్టులపై పోలీసులను పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, భద్రయ్య తదితరులు పర్యవేక్షించారు. హెచ్ఎంఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వర్తించారు. సోమవారం రాత్రి పూట విధులకు హాజరైన 36 మంది ఈపీ ఆపరేటర్లను ముందు జాగ్రత్తగా ఓసీపీ-3 బేస్‌వర్క్‌షాప్‌లో అదుపులో ఉంచుకున్నారు. కానీ హాజరు శాతం పెరగడంతో వారిని సాయంత్రం పంపించివేశారు. 2013లో జరిగిన సకలజనుల సమ్మె తర్వాత జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వగా, దానికి కార్మికుల నుంచి ఆశించిన స్పందన కానరాలేదు. గుర్తింపు సంఘం సమ్మె విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడడం వల్లనే సమ్మె పాక్షికంగా జరిగిందని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. -
సమ్మె బాటలో జూడాలు
నెల్లూరు (వైద్యం): తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ర్టవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలుపుతూ జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న జూడాలు సోమవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావును ఆయన చాంబర్లో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ పీజీ కోర్స్ పూర్తి చేసుకుని వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న తమ నుంచి రూ.20 లక్షల బాండ్ ష్యూరిటీని కోరడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. ఎక్కువగా మధ్య, పేద తరగతుల నుంచి ఈ స్థాయికి చేరుకున్న తమను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు. కానీ శాశ్వత వైద్యసేవ బాధ్యతలను ప్రభుత్వం తమకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల విడుదల చేసిన 1,024 ప్రభుత్వ వైద్యుల పోస్టులకు 12 వేల మంది డాక్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చాయంటే ప్రభుత్వ వైద్యులుగా ఎక్కడైనా సేవలందించడానికి తామంతా ఆసక్తి చూపుతున్నట్లు కాదా? అని వారు ప్రశ్నించారు. జూనియర్ డాక్టర్లుగా తమకు వైద్యశాలల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్య పరికరాలు, అధునాతన వైద్య విధాన ఎక్విప్మెంట్స్ అందుబాటులో లేక రోగి మరణిస్తే అందుకు తామే దాడులకు గురవుతున్నామని మండిపడ్డారు. 9 నెలలుగా జీతాల్లేవ్ జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్న తమకు ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు అందలేదని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నించారు. తమ సమస్యలను సామరస్యంగా పరిశీలించి, పరిష్కరించకపోతే 48 గంటల తర్వాత మెరుపు సమ్మెకు దిగుతామని, అత్యవసర ైవె ద్య సేవలను సైతం బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని జూనియర్ డాక్టర్లు తెలియజేశారు. సమ్మెలో మహేష్, ధనుంజయ్‌రెడ్డి, అర్చన, భరత్, మస్తాన్, కరుణ్‌కుమార్ తదితర 42 మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు.. డీఎస్ఆర్ ఆసుపత్రిలోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాము. జూడాల సమ్మె వల్ల ఏలాంటి ఇబ్బంది లేదు. రోగులకు అవసరమైన అత్యవసర సేవలతో సహా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశాము. -రవీంద్రనాథ్ ఠాగూరు, డీఎస్ఆర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డీఎంఈ దృష్టికి తీసుకెళ్లా... జూనియర్ డాక్టర్ల సమస్యలను ఇప్పటికే డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లాం. జూడాల డిమాండ్లు న్యాయపరమైనవే. కొన్ని నెలలుగా స్టైఫండ్స్ రాని విషయం వాస్తవమే. -ప్రభాకర్‌రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ -
వీవోఏలపై వికృత చర్యలు
విధుల్లో చేరకపోతే తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపు అధికారులకు అనధికారికంగా హుకుం జారీ జిల్లాలో 52రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కార్ వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం వికృత చర్యలకు పాల్పడుతోంది. వారి నోరు నొక్కేసేందుకు దిగజారి వ్యవహరిస్తోంది. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. 15 నెలల వేతన బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 2,125 మంది వీవోఏలు కుటుంబాలు గడవక అల్లాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుడ్లవల్లేరు : ఐకేపీలో డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చే విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్ల(వీవోఏ)ల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. 15 నెలల వేతనాలు ఎగవేయడంతో కుటుంబాలు పస్తులుంటున్నాయి. వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లాలో 2,125మంది వీవోఏలు సెప్టెంబరు 15 నుంచి సమ్మెబాట పట్టారు. వీరి ఉద్యమాన్ని పట్టించుకున్న పాలకులే కరువయ్యారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం చేయకపోగా ఉద్యమబాట పట్టిన వారిని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకూ వీవోఏలతో వెట్టిచాకిరి చేయించుకుని వేతనాలు కూడా ఇవ్వకుండా తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇవ్వవలసిన 15నెలల వేతనాల్ని పక్కన పెట్టి... సమ్మె నుంచి తప్పుకుని తాము చెప్పినట్లుగా విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అధికారులకు అనధికార హుకుం జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలగించే హక్కే లేదు వీవోఏలను బలవంతంగా తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. సమ్మె విరమించి విధులకు రావాలంటూ బెదిరింపులకు దిగితే ఆందోళనలు తప్పవు. వారి వేతన బకాయిలు చెల్లిస్తే విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. బెదిరింపులు తగవు. కె.సుబ్బారావు, గుడివాడ డివిజన్ సీఐటీయూ కార్యదర్శి వేతనాలు ఎవరు ఇస్తారు జిల్లాలో 2,125మంది వీవోలకు 15నెలల వేతనాల్ని ప్రభుత్వం బకాయి పడింది. సర్కార్ మారిందని ఆ వేతనాలు మరచిపోవాలంటే ఎలా? వీవోఏలకు ప్రభుత్వ ఆదేశం మేరకు ఇచ్చిన సెల్ఫోన్లు కూడా లాక్కోవటమే కాకుండా కేసులు పెట్టే ప్రయత్నాలు చేసిన అధికారులు చేయించుకున్న పనికి వేతనాలు కూడా చెల్లిస్తే బాగుంటుంది. అప్పుడే విధుల్లో చేరతారు. ఎ.కమల, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు -
హీరో కిషన్‌తో సమ్మె డాక్టర్లు
-
గుండెల్లో గోదావరి...
వాళ్లు సమ్మెకు దిగితే.. వీరికిదే పని అని లోకం కోడై కూస్తుంది. రోగులను పట్టించుకోవడం లేదని ఆడిపోసుకుంటుంది. వైద్యం చదివిన విజ్ఞులు సమ్మె బాట ఎందుకు పట్టారో ఆలోచించే ప్రాజ్ఞులు కనిపించరు. థర్మామీటర్ పట్టాల్సిన చేతులు ధర్మాన్ని ఎందుకు అర్థిస్తున్నారో అడిగేవారుండరు. గుండె చప్పుడు వినేవారి గుండెల్లో బాధను పట్టించుకోరు. అందుకే నాడి చూడాల్సిన జూడాలు.. నేడీ సమ్మెకు ఎందుకు దిగారో సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా హీరో సందీప్ కిషన్ పలకరించారు. సమ్మెట పోటు వెనకున్న అసలు సత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. సందీప్ కిషన్: వైద్యో నారాయణో హరిః అంటారు. అంటే డాక్టర్లు మానవాళికి దేవుళ్లు. అలాంటిది మీరిలా ఏడాదికోసారి రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటి? గోపిచంద్: నిజమే.. కానీ ఆ దేవుడు తీర్చలేని కష్టాలుంటే ఏం చేస్తాం. చేతులు, కాళ్లు పట్టుకున్నా పని జరగడం లేదు. అందుకే వీధిలోకి వస్తున్నాం. సందీప్ కిషన్: ఇలా ధర్నాలు చేయడం వల్ల మీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా? ప్రవీణ్: రిక్వెస్టులు చేయడాలు.. లెటర్లు రాయడాలు అన్నీ చేశాం. దేనికీ స్పందన లేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. సందీప్ కిషన్: స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేయాల్సిన మీరు విధులకు హాజరుకాకుండా సమ్మెలు చేయడాన్ని కామన్ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు కదా! రవితేజ: మాకున్న ఇబ్బందులేంటో తెలియక సార్. మేం విధులకు హాజరుకాకుండా పేషంట్లను ఇబ్బంది పెడుతున్నామన్నది అవాస్తవం. పదింటికి ధర్నా అంటే ఉయదం 8కే ఆస్పత్రికి వెళ్లి చేయాల్సిన పనులు పూర్తి చేస్తున్నాం. రోజంతా రోడ్డుపై కూర్చోవడం లేదు. ఒకట్రెండు గంటలు ధర్నాలో పాల్గొని మిగతా సమయంలో మా విధులు మేం నిర్వర్తిస్తున్నాం. నరేష్: కానీ మీడియాలో మాత్రం.. జూడాల సమ్మెతో రోజుకు ఇన్ని ప్రాణాలు పోయాయని వస్తోంది. సమ్మెలేని రోజుల్లోనూ ఇక్కడ వైద్యం సంగతి ఇలాగే ఉంటుందని మీడియాకి తెలియదంటారా?. మేం పని చేస్తున్నది ప్రభుత్వాస్పత్రిలో సార్. ఇక్కడ వైద్యం, జీతాలు.. అన్నీ ఆలస్యమే.. సందీప్ కిషన్: అవును.. మీకు జీతాలు ఎలా ఉంటాయి? పృథ్వీరాజ్: 9,600 సార్. రేపు పోస్టింగ్ వచ్చాక మరో ఐదారువేలు పెరుగుతుందంతే. అదీ ఐదారు నెలలకోసారి ఇస్తారు. జీతాల కోసం కడుపుమండి ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. సందీప్ కిషన్: అన్నింటికీ ధర్నా, సమ్మె అనకండి భయ్యా! రాజు: మా సమస్య గురించి ప్రభుత్వం ఆలోచించనపుడు.. కనీసం ప్రజల దృష్టికైనా తీసుకెళ్తే వారైనా అర్థం చేసుకుంటారు కదా! రాకేష్: మా బ్యాడ్‌లక్ ఏంటంటే.. ప్రజలకు మా సమస్యలేంటో పూర్తిగా తెలియదు. నిన్న ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ చేశారు. ‘ఏడాది పల్లెటూళ్లో పనిచేస్తే మీ సొమ్ము ఏంపోతుంది’ అని. మేం చెయ్యమని ఎప్పుడూ అనలేదు. అనకూడదు కూడా. ఈ రోజు చిన్న చిన్న అవసరాలకు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు సిటీకి వస్తున్నారంటే గ్రామాల్లో కనీస వైద్యసదుపాయాలు లేకనే కదా! ఆ లోటును భర్తీ చేయడానికి మేం ఎప్పుడూ సిద్ధమే. షర్మిల: మా సమస్యలను పట్టించుకోకుండా.. మేం శాంతియుతంగా చేస్తున్న సమ్మెను సమస్యగా చూపిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఆస్పత్రి, కాలేజీ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో.. ఇప్పుడు ఇక్కడ 144 సెక్షన్ విధించారంటే నమ్ముతారా? సందీప్ కిషన్: ఇప్పుడు మనం 144 సెక్షన్ పరిధిలో ఉన్నామా? లలిత: అవును సార్. సందీప్ కిషన్: ఓకే.. మీ సమస్యలు, పరిష్కారాలు పక్కన పెడితే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదవాడికి మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? రవితేజ: సార్! గాంధీ ఆస్పత్రిలో ఒక పేషంట్‌కి ఎమ్ఆర్ఐ స్కాన్ రాస్తే అతని నంబరు రావడానికి కనీసం నెల పడుతుంది. ఈలోగా అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చెప్పాం కదా! అన్నీ ఆలస్యమే. కారణం కావాల్సిన పరికరాలు, సరైన వసతులు లేకపోవడం. పృథ్వీరాజ్: అవన్నీ అనవసరం సార్. ఇన్ని దశాబ్దాల కాలంలో గాంధీ ఆస్పత్రికి వైద్యం కోసం ఒక్క రాజకీయ నాయకుడైనా వచ్చారా? ఏ సెలిబ్రిటీ అయినా ఇటువైపు కన్నెత్తి చూశారా? చుట్టుపక్కల జిల్లాల్లోని పేదవాళ్లకు మాత్రం అక్కడ డాక్టర్లు గాంధీకి వెళ్లండి, ఉస్మానియాకి వెళ్లండని రాసి పంపిస్తారు. ఇక్కడికి వచ్చాక పేషంట్లు తెల్లమొహం వేస్తారు. ప్రశాంతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని చాలా పరిస్థితులు మారాలి. మేం డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కున్న వైద్యులం కాదు. కష్టపడి చదివాం. మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తేనే కదా.. పేషంట్లను కాపాడటానికి ఉత్సాహంగా ముందుకు రాగలుగుతాం. సందీప్ కిషన్: ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సమ్మెలు చేయొచ్చు కానీ.. వైద్యులు రోడ్డెక్కకూడదు. నాలుగు గోడల మధ్య సెలైంట్‌గా ఆపరేషన్ చేసి ప్రాణాన్ని ఎలా నిలబెడతారో.. మీ సమస్య కూడా అంతే ప్రశాంతంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ. సందీప్ కిషన్: ఇంతకీ మీ సమస్య ఏమిటో వివరంగా చెబుతారా? మనోజ్: ఐదేళ్లు వైద్య విద్య పూర్తిచేసుకున్న మెడికల్ విద్యార్థులంతా ఏడాది పాటు రూరల్ సర్వీస్ చేస్తేనే డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారట. సందీప్ కిషన్: అలా చేస్తేనే డాక్టర్ డిగ్రీ ఇస్తాననడం కరెక్ట్ కాదేమో, కానీ.. మిమ్మల్ని గ్రామాలకు పంపించడం మంచిదే కదా. డాక్టర్లంతా పట్నాల్లో ఉంటే.. పల్లెల గతేంటి? పృథ్వీరాజ్: మేం గ్రామాలకు వెళ్లబోమని ఏ రోజూ అనలేదు. ఏడాది మాత్రమే టెంపరరీ బేసిస్‌పై పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వోద్యోగి గ్రామాల్లో పనిచేయాలంటే.. కనీసం ఐదేళ్లు సమయమిస్తారు. ఉదాహరణకు టీచర్‌ను తీసుకోండి.. ఏడాదికో ఊరు మారరు కదా! ఏడాదికో డాక్టర్ వచ్చిపోతుంటే గ్రామస్తులకు వైద్యునితో అనుబంధం ఎలా ఏర్పడుతుంది. హస్తవాసి అనే సెంటిమెంట్ గురించి కూడా మీకు తెలుసు కదా! వారికి డాక్టర్‌పై నమ్మకం కుదరడానికి ఏడాది టైం పడుతుంది. ఇంతలో కొత్త వైద్యుడు వస్తే ఎలా? గ్రామాల్లో వైద్యం అంటే నాలుగు మందులు.. రెండు ఇంజెక్షన్లు ఇవ్వడం కాదు. వ్యాధులు, పరిసరాల విషయంలో గ్రామస్తులను చైతన్యవంతుల్ని చేయాలి. ఇవన్నీ ఏడాదిలో ఎలా చేయగలం?. లలిత: లెసైన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదంటారు. అలాంటప్పుడు చేతిలో డిగ్రీ లేకుండా మేం వైద్యం చేయడం ఏమిటీ?. సిటీల్లో బోలెడన్ని ఆస్పత్రులు ఉంటాయి. సిటీలోని రోగుల వైద్యానికి ప్రొఫెసర్లు కావాలి. అదే పల్లెవాసులకు మెడికల్ డిగ్రీ లేనివాడు వైద్యం చేయాలా? ప్రజల తరఫున ఆలోచిస్తే ఇది ఎంత అన్యాయమో తెలుస్తుంది. రవితేజ: మాకు పర్మనెంట్ ఉద్యోగం కావాలి. అడవుల్లోని గ్రామాల్లో పడేసినా ఫర్వాలేదు. కానీ ఏడాది కోసమో.. ఆర్నెల్ల కోసమో అంటే మాత్రం ఒప్పుకోం. దీని వల్ల మా జీవితాలు బాగుపడవు.. అటు పల్లె ప్రజలకు సరైన వైద్యం అందదు. సందీప్ కిషన్: కానీ బయట మీ గురించి టాక్ మరోలా వినిపిస్తోంది..! రాజు: అంతే సార్. మా నోరు నొక్కడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది రూరల్ డాక్టర్ పోస్టింగ్‌కు 1,200 సీట్లు కేటాయిస్తే 16 వేల మంది జూడాలు అప్లై చేసుకున్నారు. పల్లెలకు వెళ్లడం ఇష్టం లేకుంటే అంతమంది పోటీ పడరు కదా. సందీప్ కిషన్: అంటే ఏడాది కాకుండా నాలుగైదేళ్లయితే మీకు ఓకేనా? పృథ్వీరాజ్: సరిపోతుంది సార్. అలాగే పర్మినెంట్ చేస్తే నో ప్రాబ్లమ్. రిపోర్టర్ సందీప్ కిషన్ -
సమ్మెకు తాత్కాలిక పరిష్కారం
సాక్షి, మంచిర్యాల : డిమాండ్ల సాధన కోసం విద్యుత్ స్పాట్ బిల్లింగ్ ఆపరేటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు తాత్కాలిక పరిష్కారాన్ని సిద్ధం చేశారు. ఇం దులో భాగంగా విద్యుత్‌శాఖ సిబ్బందితో గురువారం నుంచి వినియోగదారులకు బిల్లులు అందించేందుకు స మాయత్తమయ్యారు. టాన్స్‌కో శాఖ ఎంపిక చేసిన కాం ట్రాక్టర్లకు చెందిన ఆపరేటర్ల ద్వారా వినియోగదారులకు బిల్లులు అందజేసే సేవలను పొందుతోంది. జిల్లాలోని 3,77,592 సర్వీసులకు చెందిన బిల్లులు వినియోగదారులకు అందిస్తున్నందుకు రూ.9.21 లక్షలను ఆయా కాం ట్రాక్టర్లకు ప్రతి నెలా చెల్లిస్తోంది. ఆపరేటర్ల సేవలను బట్టి వారికి సదరు గుత్తేదార్లు భత్యం ఇస్తుంటారు. తమకు నిర్ధేశిత వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఒకటో తేదీ నుంచి ఆపరేటర్లు సమ్మె చేస్తున్నారు. ఆలస్యం అయితే.. బిల్లుల మోతే..! బిల్లులు అందజేసే సమయంలో సమ్మె చేయడంతో వినియోగదారులతోపాటు ట్రాన్స్‌కో వర్గాలు ఆలోచనలో పడ్డాయి. సమ్మె ముగిసిన అనంతరం బిల్లులు ఆలస్యంగా అందజేస్తే ఆ మేరకు విద్యుత్ యూనిట్లు పెరిగి భారం వినియోగదారులపై పడనుంది. ప్రస్తుతం గృహ కేటగిరీ స్లాబ్‌లు 50 యూనిట్ల వరకు అయితే యూనిట్‌కు రూ.1.45 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50-100 యూనిట్ల లోపు అయితే మొదటి యాభై యూనిట్లకు రూ.1.45, 51-100 వరకు రూ.2.60 విద్యుత్ వర్గాలు చార్జీ వేస్తాయి. 100-200 యూనిట్ల వరకు వాడితే మొదటి యాభై యూనిట్లకు రూ.2.60, 51-100 వరకు రూ.3.25, 151-200 యూనిట్లకు రూ.3.60 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధంగా యూనిట్లు పెరిగినకొలది చెల్లించే ధరలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమ్మె చేస్తున్న తర్వాత బిల్లులు వస్తే తమ పరిస్థితి ఏం కాను అని పలువురు వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆపరేటర్ల డిమాండ్లు ఇవే.. పట్టణ ప్రాంతాల్లో కనెక ్షన్ ఇచ్చే రూ.1.45 ను రూ.2 చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని చెల్లించే రూ.1.80ని రూ.2.50లకు పెంచాలి. కనీస వేతనంగా రూ.10 వేలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ విషయమై ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్‌ను సంప్రదించగా ఆపరేటర్లు సమ్మె చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సమ్మెతో బిల్లుల చెల్లింపు ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున విద్యుత్ శాఖ వర్గాలచే బిల్లులు చెల్లించే సన్నాహాలు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు తగు నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.