
సమ్మె బాటలో జూడాలు
నెల్లూరు (వైద్యం): తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ర్టవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలుపుతూ జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న జూడాలు సోమవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావును ఆయన చాంబర్‌లో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ పీజీ కోర్స్ పూర్తి చేసుకుని వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న తమ నుంచి రూ.20 లక్షల బాండ్ ష్యూరిటీని కోరడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. ఎక్కువగా మధ్య, పేద తరగతుల నుంచి ఈ స్థాయికి చేరుకున్న తమను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు. కానీ శాశ్వత వైద్యసేవ బాధ్యతలను ప్రభుత్వం తమకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల విడుదల చేసిన 1,024 ప్రభుత్వ వైద్యుల పోస్టులకు 12 వేల మంది డాక్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చాయంటే ప్రభుత్వ వైద్యులుగా ఎక్కడైనా సేవలందించడానికి తామంతా ఆసక్తి చూపుతున్నట్లు కాదా? అని వారు ప్రశ్నించారు.
జూనియర్ డాక్టర్లుగా తమకు వైద్యశాలల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్య పరికరాలు, అధునాతన వైద్య విధాన ఎక్విప్‌మెంట్స్ అందుబాటులో లేక రోగి మరణిస్తే అందుకు తామే దాడులకు గురవుతున్నామని మండిపడ్డారు.
9 నెలలుగా జీతాల్లేవ్
జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్న తమకు ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు అందలేదని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నించారు. తమ సమస్యలను సామరస్యంగా పరిశీలించి, పరిష్కరించకపోతే 48 గంటల తర్వాత మెరుపు సమ్మెకు దిగుతామని, అత్యవసర ైవె ద్య సేవలను సైతం బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.
ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని జూనియర్ డాక్టర్లు తెలియజేశారు. సమ్మెలో మహేష్, ధనుంజయ్‌రెడ్డి, అర్చన, భరత్, మస్తాన్, కరుణ్‌కుమార్ తదితర 42 మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు..
డీఎస్‌ఆర్ ఆసుపత్రిలోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాము. జూడాల సమ్మె వల్ల ఏలాంటి ఇబ్బంది లేదు. రోగులకు అవసరమైన అత్యవసర సేవలతో సహా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశాము.
-రవీంద్రనాథ్ ఠాగూరు, డీఎస్‌ఆర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్
డీఎంఈ దృష్టికి తీసుకెళ్లా...
జూనియర్ డాక్టర్ల సమస్యలను ఇప్పటికే డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లాం. జూడాల డిమాండ్లు న్యాయపరమైనవే. కొన్ని నెలలుగా స్టైఫండ్స్ రాని విషయం వాస్తవమే.
-ప్రభాకర్‌రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్