వీవోఏలపై వికృత చర్యలు
విధుల్లో చేరకపోతే తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపు
అధికారులకు అనధికారికంగా హుకుం జారీ
జిల్లాలో 52రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కార్
వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం వికృత చర్యలకు పాల్పడుతోంది. వారి నోరు నొక్కేసేందుకు దిగజారి వ్యవహరిస్తోంది. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. 15 నెలల వేతన బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 2,125 మంది వీవోఏలు కుటుంబాలు గడవక అల్లాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుడ్లవల్లేరు : ఐకేపీలో డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చే విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్ల(వీవోఏ)ల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. 15 నెలల వేతనాలు ఎగవేయడంతో కుటుంబాలు పస్తులుంటున్నాయి. వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లాలో 2,125మంది వీవోఏలు సెప్టెంబరు 15 నుంచి సమ్మెబాట పట్టారు. వీరి ఉద్యమాన్ని పట్టించుకున్న పాలకులే కరువయ్యారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం చేయకపోగా ఉద్యమబాట పట్టిన వారిని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకూ వీవోఏలతో వెట్టిచాకిరి చేయించుకుని వేతనాలు కూడా ఇవ్వకుండా తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇవ్వవలసిన 15నెలల వేతనాల్ని పక్కన పెట్టి... సమ్మె నుంచి తప్పుకుని తాము చెప్పినట్లుగా విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అధికారులకు అనధికార హుకుం జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తొలగించే హక్కే లేదు
వీవోఏలను బలవంతంగా తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. సమ్మె విరమించి విధులకు రావాలంటూ బెదిరింపులకు దిగితే ఆందోళనలు తప్పవు. వారి వేతన బకాయిలు చెల్లిస్తే విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. బెదిరింపులు తగవు.
కె.సుబ్బారావు,
గుడివాడ డివిజన్ సీఐటీయూ కార్యదర్శి
వేతనాలు ఎవరు ఇస్తారు
జిల్లాలో 2,125మంది వీవోలకు 15నెలల వేతనాల్ని ప్రభుత్వం బకాయి పడింది. సర్కార్ మారిందని ఆ వేతనాలు మరచిపోవాలంటే ఎలా? వీవోఏలకు ప్రభుత్వ ఆదేశం మేరకు ఇచ్చిన సెల్‌ఫోన్లు కూడా లాక్కోవటమే కాకుండా కేసులు పెట్టే ప్రయత్నాలు చేసిన అధికారులు చేయించుకున్న పనికి వేతనాలు కూడా చెల్లిస్తే బాగుంటుంది. అప్పుడే విధుల్లో చేరతారు. ఎ.కమల, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు