
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వివేక్‌ను పోటీలో నిలిపే అంశంపై బీజేపీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి ఎస్.కుమార్‌ను బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసినా ఆయనకు బీ–ఫారం ఇవ్వలేదు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులకు బీ–ఫారాలను అందజేసింది. మాజీ ఎంపీ వివేక్‌ను పెద్దపల్లి నుంచి పోటీలో నిలపాలన్న ఆలోచనతోనే ఎస్.కుమార్‌కు బీ–ఫారం నిలిపేసినట్లు తెలిసింది. మరోవైపు వివేక్‌తో బీజేపీ ముఖ్యనేతలు రెండు రోజులుగా మంతనాలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని అంశాల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి హామీ కోసం వివేక్ ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వివేక్.. అమిత్‌షాతో భేటీ అయ్యాకే పోటీపై స్పష్టత రానుంది. మరోవైపు మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోటీలో నిలిపేందుకు బీజేపీ నేతలు మంతనాలు జరిపారు. అయితే ఆమె నుంచి సానుకూలత లభించకపోవడంతో పార్టీ నాయకుడు రఘునందన్‌రావుకు ఆదివారం బీ–ఫారం అందజేశారు. వరంగల్ నుంచి పార్టీ నేత చింతా సాంబమూర్తి పేరును ఖరారు చేశారు. అయితే మాజీ మంత్రి విజయరామారావుతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అంగీకారం కుదిరితే వరంగల్ అభ్యర్థిగా ఆయన పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment