
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ చేపట్టనున్న ప్రగతి నివేదన సభకు భారీగా జనసమీకరణ చేస్తున్న దరిమిలా సెప్టెంబర్ 2న లక్షలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. మరోవైపు సభ జరిగే కొంగరకలాన్ వైపునకు వేలాది వాహనాలు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణలోని వివిధ టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌ల గండం పొంచి ఉంది. ఆర్టీసీ నుంచి ఏకంగా 7వేలకుపైగా బస్సులను అడుగుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రోజు ప్రయాణాలు పెట్టుకున్నవారిలో ఆందోళన రేగుతోంది. ఆర్టీసీ వద్ద సుమారు 10,500 బస్సులు ఉన్నాయి. వీటిలో రోజూ 97 లక్షల మంది ప్రయాణిస్తారు. నిజంగా 7వేల బస్సులను సభ కోసం పంపిస్తే.. దాదాపుగా 50 లక్షలకుపైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.
టోల్ జామ్‌లు తప్పవా?
సభకు 25 లక్షల మందిని తరలించేందుకు లక్ష వాహనాలను వినియోగిస్తామని టీఆర్‌ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ భయం వెంటాడుతోంది. తెలంగాణలో విజయవాడ, పుణే, ముంబై, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులు, రాజీవ్ రహదారి, నార్కెట్‌పల్లి –అద్దంకి హైవేలతో కలిపి 17కుపైగా టోల్‌గేట్లు ఉన్నాయి. పండుగ సమయాల్లో ఈ టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు సహజమే. ఆర్టీసీ బస్సులు కొరత, పెళ్లిళ్ల నేపథ్యంలో ఆరోజు ప్రైవేటు వాహనాలు, సభకు వెళ్లే వాహనాలు ఒకేసారి బయటకి వస్తే ఈ ఇబ్బంది రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి.
మినహాయించాలని టోల్‌గేట్లను ఆదేశిస్తారా?
రాష్టంలోని 17 టోల్ గేట్ల నుంచి బీవోటీ కాంట్రాక్టర్లకు రోజూ దాదాపు రూ.2.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఎంత సభ ఉన్నా.. నిబంధనల్లో పేర్కొన్న సభ్యులకు తప్ప ఇతరులు ఎవరైనా సరే.. టోల్ చార్టీ చెల్లిస్తేనే అనుమతిస్తామని టోల్‌నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లే వాహనాలకు మినహాయింపు వస్తుందని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోజు మినహాయింపు ఇవ్వాల్సి వస్తే.. ఆ టోల్ ఛార్జీలను ఎవరు చెల్లిస్తారన్న ప్రశ్న ఇపుడు ఆసక్తికరంగా మారింది.
ఏర్పాట్లు చేయడం లేదు: రైల్వే
సభ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ప్రత్యేక రైళ్లు వేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్ఫష్టం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో రైలు మార్గంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాల ప్రజలంతా మరింత నీరుగారిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment