
హుజూర్‌నగర్: ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. రూ. కోట్ల ప్రజాధనంతో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకొని ఒక వైపు ప్రజలకు, మరోవైపు ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉండకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగుల పాలిట పెనుప్రమాదంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు, హెల్త్ కార్డులు అందరికీ అందజేసేందుకు, కేజీ టు పీజీ అమలుకు ఉపాధ్యాయులతో కలసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ చెప్పారు. మూడున్నరేళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు.
నల్ల ధనాన్ని వెలికి తీస్తామని పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. రూ.500, రూ. వెయ్యి నోట్లు రద్దు చేసి రూ. 2 వేల నోట్లు ముద్రించి కుబేరులను మరింతగా ప్రోత్సహించినట్లయిందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 120 వస్తువులపై జీఎస్‌టీ మినహాయింపు చేసిందని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment