‘చెక్కిస్తే’ పోలా..! | Pending Cheques in Divisions | Sakshi
Sakshi News home page

‘చెక్కిస్తే’ పోలా..!

Published Fri, Mar 22 2019 7:11 AM | Last Updated on Tue, Mar 26 2019 12:37 PM

Pending Cheques in Divisions - Sakshi

సాక్షి సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు డీలర్ల వ్యాపార లావాదేవీలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి వారి ద్వారా రావాల్సిన పన్నుల వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పలు డివిజన్ల పరిధిలో డీలర్లు చెల్లించిన చెక్కులు వందల సంఖ్యలో బౌన్స్‌ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.  తద్వారా శాఖకు రావాల్సిన ఆదాయంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సర్కిళ్లలో అధికారులు డీలర్ల వ్యాపారలావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించి వారు కట్టాల్సిన పన్నులకు సంబంధిచిన డిమాండ్‌ నోటీసులు అందజేస్తారు. దీనిపై స్పందించే డీలర్లు చెల్లించాల్సిన మొత్తానికి సంబందించి చెక్కులు ఇస్తున్నారు. ఇందులో కొన్ని చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డివిజన్లతో పాటు సర్కిళల్లలోనూ పెద్ద సంఖ్యలో చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి.  గతంలో య్యిట్‌ రూపంలో వసూలు చేసిన చెక్కులు కూడా ఇప్పటివరకు క్లియర్‌ కాలేదని సదరు శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా కొందరు డీలర్లకు డబ్బులు చెల్లించాలిని నోటీసులు జారీ చేశామని. మరికొందరి చెక్‌బౌన్స్‌లకు సంబంధించిన లెక్కలు తేలాల్సి ఉందని తెలిపారు. 

అన్ని డివిజన్లలోనూ ఇదే తంతు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డివిజన్లలోనూ చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.డీలర్లు ఇచ్చిన  చెక్కులే ఎక్కువగా బౌన్స్‌ అవుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో గత ఏడాది  నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పన్ను బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్కిల్‌ అధికారుల చెక్కులను తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కమిషనర్‌ పలు డివిజన్లలో పన్ను వసూలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చెక్కులు తీసుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. టార్గెట్‌ పూర్తి కోసం అధికారులు పెండింగ్‌ చెక్‌లకు సంబందించి వసూల్లు చేయకుండా సదరు డీలర్ల నుంచి 2018–19 సంవత్సరానికి జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల అధారంగా  పన్నులు బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు ‘వ్యాట్‌’ చెక్కులు పెండింగ్‌లో ఉన్నా వాటిని పక్కనపెట్టిన సర్కిల్‌ అధికారులు జీఎస్టీ అమలు నుంచి టార్గెట్‌ పూర్తి కోసం కొత్త పన్నులు వసూలు చేస్తున్నారు.

పాతబకాయిలు అంతేనా..?
పాత బకాయిల విషయం పట్టించుకోకుండా కొత్త వసూలు చేస్తుండటం పెండింగ్‌లో ఉన్న చెక్కుల విషయంలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారుల బదిలీలలో కొత్తగా వచ్చే అధికారులకు పెండింగ్‌లో ఉన్న చెక్కుల విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటం లేదు.
గత సెప్టెంబర్‌ నెలలో వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు అన్ని విభాగాల్లో భారీగా బదిలీలు జరగాయి. డివిజన్లు, సర్కిల్‌ పరిధిలోని అధికారులు, సిబ్బంది బదలీ అయ్యారు. దీంతో కొత్తగా వచ్చిన అధికారులు, సిబ్బందికి తమ పరిధిపై పట్టులేకపోవడంతో చెక్‌ బౌన్స్‌లను పట్టించుకునేవారు కరువయ్యారు. దీనికితోడు రీఆర్గనైజేషన్‌లో భాగంగా పలు సర్కిల్‌లలో పాత వాటిని రద్దు చేసి కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అధికారులకు తమ సర్కిల్‌లో ఎందరు డీలర్లు ఉన్నారు ? ఎన్ని చెక్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయంపై సమాచారం లేదు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు టార్గెట్‌ పూర్తి కోసం పెండింగ్‌ అంశాలను పక్కన పెట్టి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టినట్లు స్వయంగా అధికారులే పేర్కొంటుండటం గమనార్హం.

ఎప్పుడైనా పన్ను చెల్లించాల్సిందే  
డీలర్లకు కమర్షియల్‌ టాక్స్‌ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అది ఆన్‌లైన్‌లో నమోదు అవుతుంది.  దీంతో ఎన్నేళ్లయినా డీలర్‌ పన్ను బాకీ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆన్‌లైన్‌ సీటీడీ జారీ అయితే అందులో మార్పులు చేసేందుకు, పన్ను తగ్గించేందుకు ఎలాంటి అవకాశం ఉండదని ఉన్నత అధికారులు చెబుతున్నారు. ఎప్పుడైనా సదరు డీలరు సీటీడీ ఉత్తర్వుల ప్రకారం పన్ను చెల్లించాల్సిందే. అయితే పలు సర్కిళ్లలో అధికారులు డీలర్లకు కొంత వెసలుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పెండింగ్‌ చెక్‌లకు సంబంధించి ఇంతవరకు డీలర్ల ఖాతాలను అటాచ్‌మెంట్‌ చేయడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద ఇప్పటికి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఆస్తులు జప్తు చేయకపోవడం ఇందుకు బలం చేకూరుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement