భువనగిరి : భార్యాభర్తలిద్దరూ వృద్ధులు.. భార్య పక్షవాతంతో మంచానపడింది. పెద్దాయనకు వచ్చే పింఛను డబ్బులతో ఇల్లు గడిచేది. ప్రభత్వుం కొత్తగా రూపొందించిన పింఛన్ల జాబితాలో పేరు ఉందో లేదోనని పలువురి వద్ద వాకబు చేశాడు. లేదని చెప్పడంతో ఆ ముదుసలి గుండె పగిలింది. పడుకున్న వాడు పడుకున్నట్లే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. వృద్ధాప్యంలో..అదీ పక్షవాతంతో మంచానపడిన భార్యను ఒంటరి చేశాడు. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామానికి చెందిన బాలయ్య, అనసూయలు భార్యభర్తలు. బాల య్య(80) వృత్తిరీత్యా వడ్రంగి. 2003 నుంచి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమారులు మరో గ్రామానికి వలస పోయి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. మరో కుమారుడు గ్రామంలోనే ఉంటున్నాడు. బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే కుటుంబం గడుస్తున్నది.
ఈ క్రమంలో భార్య అనసూయకు పక్షవాతం వచ్చి మంచానపడింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న రూ.వెయ్యి పింఛను కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటికి వచ్చి విచారణ కూడా జరిపారు. శుక్రవారం జాబితాను గ్రామ పంచాయతీ వద్ద అతికిచ్చినట్లు ఇరుగుపొరుగు చెబితే వెళ్లాడు. అక్కడున్న వారిని ‘నా పేరు ఉందో..లేదో..చూడయ్యా’ అని అడగగా వారు చూసి ‘నీ పేరు లేదు’ అని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 పింఛన్‌తో బతుకుదామనుకుంటే లిస్టులో తన పేరు రాకపోవడంతో కుమిలిపోయాడు. గ్రామ పంచాయతీ వద్ద క నబడిన వారికల్లా ‘నాకు పింఛన్ రాలేదు. రేపటి నుంచి ఎట్ల బతకాలి’ అంటూ తన గోడును వెల్లబోసుకున్నాడు. గ్రామ సర్పంచ్ ఆయిలయ్యను కలిసి తనకు పింఛన్ ఇప్పించమని వేడుకున్నాడు.
సాయంత్రం వరకు గ్రామంలో తిరిగి బరువెక్కిన గుండెతో ఇంటికి వెళ్ల్లాడు. రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి తర్వాత గుండెలో దడగా ఉందని..భార్య అనసూయకు చెప్పగా ఆమె కేకలు వేసి ఇరుగుపొరుగును పిలిచింది. వారు గ్రామంలోని ఆర్‌ఎంపీని పిలిచేలోపే బాలయ్య తుది శ్వాస విడిచారు. అధికారులు ఇప్పటికైనా అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ సోమ్లానాయక్ మాట్లాడుతూ పింఛన్ల లిస్ట్‌లో బాలయ్య పేరు ఉందని తెలిపారు. పేరును సరిగా గమనించకపోవచ్చని పేర్కొన్నారు.
పింఛను అస్తదో..రాదోనని
Published Sun, Nov 9 2014 3:04 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement