సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఇంకా విధానమే ఖరారు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 31.67 లక్షల వరకు అన్ని రకాల పెన్షనర్లు ఉన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత ఆధార్‌కార్డు లేని దాదాపు నాలుగు లక్షల మందికి పెన్షన్లు నిలిపివేశారు. వారంతా ఆధార్‌కార్డులు తీసుకుని వస్తే తప్ప.. పెన్షన్లు మంజూరు చేసేది లేదంటూ అధికారులు కరాఖండీగా చెబుతున్నారు. పెన్షన్లలోనూ బోగస్ లబ్ధిదారులు చాలా మంది ఉన్నారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, వారికి కొత్తకార్డులు జారీ చేస్తామని, అది దసరా నుంచి ప్రారంభిస్తామని చెప్పింది. కాని సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వడానికి లేదా ప్రస్తుతం ఉన్న వారి నుంచి పెన్షన్ తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో, కొత్త పెన్షన్‌కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది.
ఇప్పటికే దాదాపు రెండులక్షలవరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ల విధానాన్ని సమూలంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైనవారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ‘అర్హులు’ అనే పదానికి నిర్వచనం కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎదురుచూస్తోంది. సామాజిక భద్రతా పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.200ల నుంచి వెయ్యి రూపాయలకు, వికలాంగుల పెన్షన్లు రూ.500 నుంచి రూ. 1,500 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అంతేకాక ఈ పథకం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. గతంలో జరిగిన చర్చల సమయంలో... ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇవ్వొద్దని, పెన్షన్ తీసుకునే వారి పిల్లలు ఉద్యోగస్తులైనా.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా.. ట్యాక్సీ నడుపుకొంటున్న వారికీ సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వరాదని నిర్ణయించారు. వార్షిక ఆదాయానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతమున్న 31.67 లక్షల పెన్షన్లలో 2.16 లక్షలు అభయ హస్తం పెన్షన్లు ఉన్నాయి. బోగస్‌లు ఏరివేస్తే, నాలుగైదులక్షల పెన్షన్లు తగ్గిపోతాయనే అంచనాలో అధికారులున్నారు. అయితే వీరి తొలగింపునకు ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. సమగ్ర ఇంటింటి సర్వే వివరాలు అందితే తప్ప ఎవరు అర్హులో, అనర్హులో తేల్చడానికి వీలవుతుందంటున్నారు. అంతవరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఖరారు కాని కొత్త పెన్షన్ల విధానం
Published Mon, Sep 29 2014 1:42 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement