న్యూ హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో
గచ్చిబౌలి/హఫీజ్‌పేట్: కంటైన్మెంట్ జోన్ ఎత్తేసినా రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆదివారం అయినా ప్రజలు తమకు అవసరమైన సరుకులు, పాలు, కూరగాయలు తీసుకొని త్వరితగతిన ఇళ్లకు చేరుకోవడం కనిపించింది. రెండు మూడు గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. కంటైన్మెంట్ జోన్ ఎత్తేసిన కాలనీలు, బస్తీల్లో పోలీసుల బందోబస్తు, జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణ కొనసాగింది. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో 11 చోట్ల కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అందులో చందానగర్ సర్కిల్ పరిధిలో మదీనాగూడ, సితార హోటల్, అంబేడ్కర్‌నగర్, సాయినగర్, ఆదిత్యనగర్, ఇజ్జత్‌నగర్, అయ్యప్పసొసైటీ, సిస్టా హోటల్, అపర్ణా హిల్‌పార్క్‌లలో ఉండేవి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అంజయ్యనగర్, జయభేరి ఆరెంజ్‌కౌంటీలలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అందులో మొదటి విడతలో అపర్ణాహిల్‌పార్క్, జయభేరి ఆరెంజ్‌కౌంటిలలో కంటైన్మెంట్ జోన్ ఎత్తేశారు. (చిన్నారి ముందు తలవంచిన కరోనా )
రెండవ విడతలో మదీనాగూడ, సితార హోటల్, అంబేడ్కర్‌నగర్, సాయినగర్, అయ్యప్పసొసైటీ, సిస్టా హోటల్, అంజయ్యనగర్‌లలో కూడా కంటైన్మెంట్ జోన్ ఎత్తేశారు. ప్రస్తుతం చందానగర్ సర్కిల్ పరిధిలోని ఆదిత్యనగర్, ఇజ్జత్‌నగర్‌కాలనీలలో ఇప్పటికీ కంటైన్మెంట్ జోన్లు కొనసాగిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలతోపాటు ఎత్తేసిన కాలనీల్లోనూ కిరాణషాపులు తెరవలేదు. కానీ ప్రజలంతా నడుచుకుంటూ కొందరు, ద్విచక్రవాహనాలపై మరికొందరు ప్రధాన రోడ్డులోని కూడలి వద్దకు వచ్చి నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, పెరుగు కొనుగోలు చేసుకొని వెళ్లారు. మే 7వ తేదీ వరకు ఇలాంటి పరిస్థితియే కొనసాగుతుందని స్థానికులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు ఆయా కాలనీల్లో పారిశుధ్య సేవలను కొనసాగిస్తున్నారు. జంట సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు 14 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా వారికి చికిత్స అనంతరం ఏడుగురికి నెగిటివ్ వచ్చింది.(నగదు పంపిణీని నిలిపివేసిన అధికారులు)
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కొన్ని కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కొన్ని కిరాణ షాపుల వద్ద, చికెన్ షాపుల వద్ద కనీస నిబంధనలు పాటించకుండా, రక్షణ చర్యలు తీసుకోకుండా విక్రయాలు చేపడుతున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి సుభాష్‌నగర్ డివిజన్‌లోని నిన్నటి వరకు కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న జీడిమెట్ల అపురూపకాలనీలోని ఓ వీధితో పాటు, ఎస్‌ఆర్‌నాయక్ నగర్ మోడీ బిల్డర్స్ అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం కనిపించిన దృశ్యాలు ఇవి.
అయినా నిర్మానుష్యమే..
అబిడ్స్: గోషామహల్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పోలీసులు కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేశారు. కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేసినా ప్రాంతాలు నిర్మానుష్యంగానే ఉన్నాయి. కరోనా భయంతో ఈ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికి భయాందోళనకు గురవుతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ అజంతా గేటు వద్ద ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ను ఎత్తివేశారు. 15 రోజులుగా కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు బయటకు రావడం లేదు.
అత్యవసరం అయితే తప్ప..
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా అందులో ఎల్లమ్మబండ, బాలాజీనగర్, వసంత్‌నగర్ జోన్లను ఎత్తివేయగా కేపీహెచ్‌బీ కాలనీ లాస్ట్ బస్టాప్, ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని జోన్లను కొనసాగిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేసినా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి పాలు, కూరగాయలు తీసుకెళ్తున్నారు. ఎల్లమ్మబండ ప్రాంతంలో కొంతవరకు జనం నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నా.. బాలాజీనగర్‌లో మాత్రం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అధికారులు, పోలీసులు ఆయా ప్రాంతాలను ఎప్పటికప్పుడు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment