ఖమ్మం: ‘సొంత ఊరిలో సర్వే చేయించుకుంటే మంచిదటా.. ఎక్కడ ఉన్నా సర్వే రోజు మాత్రం మన ఊరికి వెళ్దాం.. మంచైనా, చెడైనా మన ఊరికే పోదాం...’ అంటూ వివిధ ప్రాంతాల్లో ఉంటున్న జిల్లా ప్రజలు గత మూడు రోజులుగా సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు ఇంటిబాట పట్టారు.
సర్వే కోసం స్వగ్రామాలకు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సర్వే కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, దేశ నలుమూలల ఉన్న ప్రజలు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ‘సర్వే రోజు స్వగ్రామంలో ఉండండి.. నేను కూడా ఆ రోజు మా ఊళ్లోనే ఉంటా’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం, సర్వే అవశ్యకతను వివరిస్తూ రాష్ట్ర, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పక్షాలు ముమ్మరంగా ప్రచారం చేశాయి.
మూడు రోజులు ముందు నుంచే సర్వేలు నిర్వహించి ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్వే రోజు వివరాలు నమోదు చేసుకోకుంటే ఎక్కడ ఇబ్బందులు పడతామోనని ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఇళ్లకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బోనాల పండుగ, రాకీ పండుగలకు వచ్చిన వారు సర్వే ముగిసిన తర్వాతే వెళ్లేందుకు ఇక్కడే ఉండిపోయారు.
రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌ల్లో రద్దీ..
స్వగ్రామాలకు ప్రజలు రాక సందర్భంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, వరంగల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో దిగి మారుమూల గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది.
మంగళవారం సర్వం బంద్ చేస్తామని అధికారులు ప్రకటించడం, మధ్యలో ఆదివారం రావడంతో శనివారం నుంచి ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరారు. సర్వే పుణ్యమా అని జిల్లాలోని ఆరు ఆర్టీసీ బస్‌డిపోల పరిధిలో ఆర్టీసీకి, రైల్వే శాఖకు ఆదాయం పెరిగింది. మామూలుగా ప్రతీ రోజు ఆర్టీసీకి సరాసరి రూ. 70 లక్షల ఆదాయం లభిస్తుండగా గత మూడు రోజులుగా కోటి రూపాయలకు పైగా వస్తోందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైల్వే శాఖకు రోజుకు రూ. 5లక్షల ఆదాయం ఉండగా మూడు రోజులుగా అది రూ. 10లక్షలు దాటింది.
పల్లెల్లో పండుగ వాతావరణం..
పండుగలకు, ఇతర కార్యక్రమాలు తప్ప కుటుంబ సభ్యులు ఒకేసారి స్వగ్రామాలకు రారు. కానీ ఈ సర్వే పుణ్యమాని ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబ సభ్యులు అంతా ఒకేసారి సొంత ఇళ్లకు రావడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్ననాటి స్నేహితులు, బంధువులు, వారి పిల్లలతో సందడి నెలకొంది. అదీ కూడా ఆఫీసులు, కార్యాలయాలు, పిల్లల పాఠశాలలకు సెలవులు రావడంతో ఏం చక్కా.. గ్రామాలకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు.
పల్లెకు పరుగులు...
Published Tue, Aug 19 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement