‘ముంపు’లో నిరసన గళం
నల్లజెండాలు ఎగురవేసిన ఆదివాసీలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్తబ్ధత
భద్రాచలం, ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందడి కనిపించలేదు. తెలంగాణ పది జిల్లాల్లో ఓ వైపు ఉవ్వెత్తున సంబురాలు చేసుకోగా, ముంపు మండలాల్లో ఆదివాసీలు నిరసన గళం వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు బదులు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిరసన దినంగా పాటించారు. భద్రాచలం లో ఆదివాసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గిరిజన అమరవీరుల విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకొని నిరసన తెలిపారు. ఆ తర్వాత అక్కడే నల్లజెండాను ఆవిష్కరించారు. చింతూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కుక్కునూరులో రాస్తారోకో నిర్వహించారు.
మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మండల సరిహద్దు గ్రామమైన లంకాలపల్లి వద్ద ‘ఆంధ్రా వద్దు-తెలంగాణ ముద్దు’ అంటూ బ్యానర్‌ను ఏర్పాటుచేశారు. ‘సీమాంధ్ర ఉద్యోగులారా.. మండలానికి రాకండి’ అంటూ నినాదాలు చేశారు. భద్రాచలం డివిజన్‌లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం(పట్టణం మినహా) మండలాలు, పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (12 గ్రామాలు మినహా) మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జాతీయజెండా ఎగురలేదు. ముంపు మండలాలన్నీ సోమవారం నుంచి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఈ ప్రాంతంలో వేడుకలు నిర్వహించలేదు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన మండలాల్లోని వివిధ శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులంతా దాదాపు తెలంగాణ రాష్ట్రానికే చెందిన వారే కావడంతో వేడుకలకు సిద్ధమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉన్నారు.