వారిపై చర్యలకు ఆదేశించలేం
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో లోక్‌సభలో జరిగిన పెప్పర్ స్ప్రే ఉదంతంపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారికి పెన్షన్, ఇతర భత్యాలు తదితర ప్రయోజనాలన్నింటినీ ఉపసంహరించేలా ఆదేశించాలని, కేంద్రం, లోక్‌సభ సెక్రటరీ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ల ను ప్రతివాదులుగా చేర్చుతూ పొన్నం పిటిషన్ వేశారు.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా.. 2014 lనాటి ఘటనపై ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా..ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.