సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి అనుమతులు సాధించడంలో రాష్ట్ర అటవీశాఖ అధికారులు రికార్డు సాధించారు. ఈ భారీ ప్రాజెక్టుకు కేవలం 9 నెలల 8 రోజుల్లోనే అనుమతులు తీసుకొచ్చి ఆల్‌టైమ్ రికార్డు సాధించారు. ఒక భారీ ప్రాజెక్టుకు ఇంత వేగంగా అనుమతులు సాధించడం దేశంలో ఇదే తొలిసారి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులకు గాని, ఇతర ప్రజా అవసరాలకు గానీ 100 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించటానికి కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు 3,168 ఎకరాల అటవీ భూములను కేవలం 10 నెలలలోపే బదలాయించడానికి అనుమతులు లభించాయి.
ఈ ప్రాజెక్టు కింద అటవీ శాఖ కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం 8 అటవీ జోన్ల పరిధిలోని స్థలాలను సేకరించి రాష్ట్ర అటవీ శాఖకు అప్పగిస్తుంది. ఈ భూముల్లో తిరిగి ఎకరాకు 1,600 మొక్కల చొప్పున మొత్తం 50.69 లక్షల మొక్కలు నాటేందుకు రాష్ట్ర అటవీ అధికారులు సంసిద్ధత తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ రూ. 722 కోట్ల నిధులను కేంద్రం వద్ద జమ చేసింది. ఈ ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతుల ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభమైంది. రాష్ట్ర అటవీ, సాగునీటి, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో కేంద్రానికి పక్కా ప్రణాళికలు సమర్పించారు.
పర్యావరణ సమస్యకూ పరిష్కారం
ఈ సందర్భంగా రాష్ట్రం పర్యావరణ జోన్ల సమస్యనూ అధిగమించింది. కవ్వాల్, ప్రాణహిత పరిధిలో వన్యప్రాణుల రక్షణకు ‘ఎకో ఫ్రెండ్లీ’ వంతెన నిర్మాణం ప్రతిపాదనను రాష్ట్ర అటవీ అధికారులు కేంద్రం ముందుంచి ఒప్పించారు. జూలై 20న కేంద్ర వన్యప్రాణి విభాగం అధికారులు మన అధికారుల ప్రతిపాదనలను ఆమోదించి సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. అన్ని పరిశీలనల తర్వాత అక్టోబర్ 24న తొలిదశ అనుమతులు వచ్చాయి. ఆ తర్వాత సాగునీటి శాఖ రూ.722 కోట్లను ‘కంపా’ నిధుల కింద జమ చేసింది. ఇదీ ఒక రికార్డే. దేశంలో ఇప్పటి దాకా ఏ ప్రాజెక్టు కోసం కూడా ఇంత పెద్ద మొత్తంలో కంపా నిధులు ఒకేసారి కేంద్రానికి జమ కాలేదు.
ప్రత్యేక అధికారి నియామకం..
రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక అధికారిని నియమించి ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నివేదికలు రూపొందించింది. ఇందుకోసం అదనపు అటవీ సంరక్షణ అధికారి శోభ ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర అధికారుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేశారు. మరో వైపు రెవెన్యూ శాఖ సమన్వయంతో ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం భూముల గుర్తింపు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించారు. ఇలా వెంటవెంటనే పనులు చేస్తూ మొదటి దశ అనుమతులు వచ్చిన నెల రోజుల్లోనే తుది అనుమతులను సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment