సాక్షి, ఇల్లందకుంట(హుజురాబాద్): కూతురికి అంగరంగవైభవంగా పెళ్లి జరిపించిన తండ్రి..వధువును అత్తాంటికి సాగనంపుతుండగా జరిగిన బరాత్‌లో ఆనందంతో నృత్యం చేస్తున్నాడు. గుండెపోటురావడంతో అక్కడే కూప్పకూలిన సంఘటన ఇల్లందకుంట మండలం మల్యాలలో చోటుచేసుకుంది. అలాగే జమ్మికుంట పట్టణం హౌసింగ్‌బోర్డులో కుమారుడి పెళ్లి ఏర్పాట్ల బిజీగా ఉన్న తండ్రి గుండెపోటురావడంతో మృతిచెందాడు. ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది.
వివరాలు ఇలా..ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన మేకల వీరస్వామి దాసు(50),శాంత దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు వీణ, వాణి, వినీ ఉన్నారు.. నిరుపేద కుటుంబానికి చెందిన దాసు 15 ఏళ్లక్రితం కుటుంబ పోషణ నిమిత్తం జమ్మికుంట వచ్చాడు. దాసు ఆర్టీఏ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. పెద్దకూతురు వీణ వివాహం హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన యువకుడు విజయ్‌తో శుక్రవారం పట్టణంలోని ఫంక్షన్ హాల్‌లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించాడు. సాయంత్రం ఇంటి వద్ద కూతురు అప్పగింతల కార్యక్రమం ముగిసిన తరువాత బరాత్ ఏర్పాటు చేశారు.
మిత్రులు, బంధువులు డ్యాన్స్‌లు చేస్తుండగా వీరస్వామి దాసు కూడా ఆనందంతో నృత్యం చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందాడు. కూతురిని అత్తారింటికి పంపే సమయంలో తండ్రి మృతిచెందడంతో వారి రోదనలు కంటతడి పెట్టించాయి.
జెడ్పీచైర్‌పర్సన్ పరామర్శ
విషయం తెలుసుకున్న జెడ్పీచైర్‌పర్సన్ కనుమల్ల విజయ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీఇచ్చారు.
పెళ్లికి ముందే తండ్రి..
జమ్మికుంట : పట్టణంలోని హౌసింగ్ బోర్డుకాలనీలో కుమారుడి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో గౌసొద్దీన్ (65) బిజీగా ఉన్నారు. శుక్రవారం ఉదయం గౌసొద్దీన్‌కు గుండెపోటురావడంతో పడిపోగా ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గౌసొద్దీన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment