అభం శుభం తెలియని బాలికలను దారుణంగా మట్టుబెట్టాడు నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డి ట్రాన్స్‌జెండర్లపై అకృత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తూ పట్టుబడ్డ కుమ్మరి వెంకట్ యాదవ్‌ప్రేమించిన సహచర మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్‌తనను ప్రేమించడం లేదన్న కోపంతో దారికాచి ఓ యువతిపై యాసిడ్ పోశాడో క్రూరుడుతెలుగు రాష్ట్రాల్లో రోజుకు దాదాపు డజనుకు పైగా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆందోళన కలిగించే దారుణాలు సమాజాన్ని భయపెడుతున్నాయి.
బంజారాహిల్స్: నేరాలు చేసినవారు జైలుకు వెళ్లి కఠిన శిక్షలు అనుభవించి వచ్చినా వారి తీరులో మార్పు రావడం లేదు. వీరిలో మార్పు రాదా..! అంటే అదంత తేలిక కాదంటున్నారు మానసిక నిపుణులు. ఈ తరహా దారుణాలకు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారే తెగబడుతున్నారని, వీరు జైలు నుంచి బయటకు వచ్చినా మళ్లీ అవే నేరాలకు పాల్పడతారని అంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, కుమ్మరి వెంకట్ యాదవ్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ను హత్య చేసిన రాకేష్‌రెడ్డి.. ఇలా ఎవరిని తీసుకున్నా వీరందరూ ‘పర్సనాలిటీ డిసార్డర్’(వ్యక్తిత్వ రుగ్మత) వ్యాధితో బాధపడుతున్నవారేనని ప్రముఖ మానసిక నిపుణురాలు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. గౌరీదేవి చెబుతున్నారు. ఇటీవలి దారుణాలపై ఆమె తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
వ్యక్తిత్వ రుగ్మతతోనే దారుణాలు
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి లాంటి వారు ‘పర్సనాలిటీ డిజార్డర్’ వ్యాధితో బాధపడుతుంటారు. ఈ వ్యాధికి చికిత్స ఉండదు. జైలులో ఉంచి పరివర్తనలో మార్పు తీసుకురావాల్సిందే. ఒక వేళ బయటకు వచ్చినా అదే తప్పు, నేరాలు పదేపదే చేస్తుంటారు. వీరికి అనుబంధాలు, ఆప్యాయతలు ఉండవు. తమ కోరికలు తీర్చుకోవడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇవి జన్యుపరంగా కూడా వస్తాయి. ఇటీవల పత్రికల్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి నేరాల్లో నేరస్తులంతా ఈ వ్యాధితో బాధపడుతున్నవారే. ఈ వ్యాధి ఉన్నవారు అందరితో నవ్వుతూ, కలివిడిగా ఉంటూనే తాము చేసే పనులు చేస్తుంటారు. వీరికి పెద్దగా అనుబంధాలు ఉండవు. ఎంతసేపై తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. మద్యానికి బానిసవడం, జల్సాగా, జులాయిగా తిరుగుతుంటారు. తప్పు చేశామన్న బాధ వీరిలో ఎప్పుడూ.. ఏ కోశానా కనబడదు.
సామాజిక సంబంధాలు ఉండవు
ఈ తరహా వారిని మానసిక శాస్త్రంలో ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’గా పేర్కొంటారు. వీరు తాము చేస్తున్న పని మంచిదిగానే భావిస్తుంటారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తులను అంతమొందించేదాకా వదలరు. క్రిమినల్ సైకియాట్రిస్టులు సైతం వీరిని మార్చలేకపోతున్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ ఈ రెండింటినీ కంట్రోల్ చేసుకునే శక్తి వీరిలో అస్సలు ఉండదు. 14 ఏళ్ల వయసు నుంచే వ్యాధికి దగ్గరవుతూ వస్తుంటారు.
వీరిలో మార్పు కష్టమే..!
పోలీసులు ఇలాంటి వారిని లోతుగా విచారించాలి. ఎప్పటి నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నారో తెలుసుకుని కారణాలు ఆరా తీయాలి. అయితే శ్రీనివాస్‌రెడ్డి లాంటి కరుడుగట్టిన హంతకుడు మారే ప్రసక్తే లేదు. నేను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు వచ్చేవారు. వారిని ప్రశ్నిస్తే ‘ఒకసారి జైలుకు వెళ్లాక ఏ నేరం చేసినా మళ్లీ వెళ్లేదే కదా! శిక్ష ఒకటే కదా’ అని చెప్పేవారు. అంటే వీరు ఆ నేరాన్ని మళ్లీ చేయడానికే నిర్ణయించుకున్నారు. పైశాచికానందం పొందే లక్షణం వీరిలో ఉంటుంది. జైలులోనే ఉంచి సంస్కారవంతంగా తీర్చిదిద్దడం ఒక్కటే చికిత్స. సమాజంలో మనిషి బతకాలంటే కొన్ని పద్దతులు ఉంటాయి. వీరు మాత్రం అందుకు విరుద్ధం. కుటుంబ విలువలు, నైతిక విలువలు వీరు పాటించరు. ఇష్టమొచ్చినట్లు బతుకుతుంటారు. ఇదే సమాజానికి హానికరంగా మారుతుంది.. అంటూ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment