‘లాకప్ హింస లైవ్’ ఎస్సై సస్పెన్షన్
⇔ మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా వేటు
⇔ బాధితుడి కేకలు విని సంతోషించిన అనిల్ ఎవరనేదానిపై ఆరా
⇔ మంగళవారం మధ్యాహ్నమే బెయిల్ పొందిన కోటేశ్వరరావు
కుత్బుల్లాపూర్: ఓ వ్యక్తిని లాకప్‌లో చితకబాదుతూ.. ప్రత్యర్థికి ఫోన్‌లో లైవ్ వినిపించిన పేట్ బషీరాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావుపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. అతనితో ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు కానిస్టేబుళ్లు రవికుమార్, బాలకృష్ణ, యు.సతీశ్‌కుమార్‌లను బుధవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.
విచ్చలవిడిగా దాష్టీకం
అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లంచంగా తీసుకుని.. అతడికి అప్పు ఇచ్చిన శివప్రదీప్ అనే వ్యక్తిని ఎస్సై కోటేశ్వరరావు హింసించిన విషయం తెలిసిందే. శివప్రదీప్‌ను తాను పనిచేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్సై కోటేశ్వరరావు.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి, హింసించాడు. తాను చితకబాదడంతోపాటు కొందరు కానిస్టేబుళ్లతోనూ కొట్టించాడు. ఈ లాకప్ హింసను అప్పు ఎగ్గొట్టిన రవీంద్ర స్నేహితుడు అనిల్‌కు లైవ్‌లో వినిపించాడు. రికార్డు చేసుకొమ్మనీ సూచించాడు. అంతేగాకుండా ‘చాలా.. హ్యాపీయా..’అని కూడా అడగడం గమనార్హం. కొందరి ద్వారా లీకైన ఈ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది కూడా. ఇక తనను హింసించడంపై శివప్రదీప్ సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు ఫిర్యాదు చేయగా.. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
రాత్రి కేసు నమోదు.. మరుసటి రోజు మధ్యాహ్నమే బెయిల్
ఎస్సై కోటేశ్వరరావుపై సోమవారం రాత్రే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై మంగళవారం మధ్యాహ్నమే కొంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులను జమానతుగా పెట్టుకుని బెయిల్ తీసుకున్నాడు. అంతేకాదు మంగళవారం సాయంత్రం పోలీసు యూనిఫారం వేసుకుని తిరిగి విధుల్లో పాల్గొనడం గమనార్హం. అయితే బెయిల్‌కు జమానతుగా ఉన్న ఓ వ్యక్తి ఎస్సై కోటేశ్వరరావుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేవాడని, ఇంతకుముందు ఆయుధ నిరోధక చట్టం కింద పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడని సమాచారం. సాధారణంగా పోలీసులు కేసు నమోదైతే సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. కానీ ఎస్సై కోటేశ్వరరావుపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా.. మేడ్చల్ కోర్టులో హడావుడిగా బెయిల్ పొందగలగడం గమనార్హం.
అనిల్ ఎవరు?
లాకప్ హింసను లైవ్‌లో విని, రికార్డు చేసుకున్న అనిల్ అనే వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అప్పు తీసుకుని ఎగ్గొట్టిన రవీంద్ర అనే వ్యక్తికి అతను స్నేహితుడని భావిస్తున్నారు. ఎస్సై బాధితుడిని కొడుతున్న క్రమంలో కేకలు, అరుపులు విని సంతోషపడిన అనిల్‌పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఓ రాష్ట్ర మంత్రి బంధువుకు తెలిసిన వ్యక్తి ద్వారా ఎస్సై కోటేశ్వరరావుకు అనిల్ పరిచయమయ్యాడని సమాచారం. ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించి నివేదిక అందజేయాలని బాలానగర్ డీసీపీ సాయి శేఖర్‌ను సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశించారు.