సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘హెల్ప్‌లైన్’కు అపూర్వ స్పందన లభిస్తోంది. ‘హెల్ప్‌లైన్’ నంబర్ 040-23472233కి శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రం నలుమూలల నుంచి 200లకు పైగా ఫోన్లు వచ్చాయి. వీటిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువుల గూర్చే ఫిర్యాదులు చేసినట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఇక తమ గ్రామాల్లోనూ చెరువు పనులను ఆరంభించాలని 50 శాతంమంది, మరమ్మతుల అవసరాన్ని మరికొంతమంది దృష్టికి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఫోన్‌లు చేసిన వారితో పాటు, వారు దృష్టికి తెచ్చిన అంశాలన్నింటినీ నోట్ చేసుకుంటున్న అధికారులు వాటిని అంశాల వారీగా వడపోత చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నంబర్‌కు ఫోన్‌ల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా మరిన్ని లైన్‌లు ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించామని, ఇప్పటికే హెల్ప్‌లైన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఈఈ, డీఈ, జేఈల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు వెల్లడించారు.