
మనస్తాపంతో వైద్యురాలి ఆత్మహత్య
హైదరాబాద్: ఉన్నత చదువులకు అర్హత సాధించలేకపోతున్నానన్న మనస్తాపంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలానికి చెందిన రాజేశం సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమార్తె అనూష(26) ఎంబీబీఎస్ చదివి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేసేవారు. అల్వాల్ మంజీర కాలనీలో ఉంటున్న అనూష పీజీ ప్రవేశ పరీక్ష పలుమార్లు రాసినా అర్హత సాధించలేకపోయారు. ఇటీవల ఉద్యోగమూ మానేశారు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బీహెచ్‌ఈఎల్‌లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి... తమ్ముడు సాగర్‌ను, అమ్మానాన్నలను మంచిగా చూసుకోమని కోరింది. అనుమానం వచ్చిన బంధువులు అనూష నివాసముండే ఇంటికి వచ్చి చూసే సరికి గది లో చున్నీతో ఉరి వేసుకుని మరణించి ఉంది. కష్టపడి ఉన్నత చదువు చదివించినా కూతురు ఆత్మహత్యకు పాల్పడడం తల్లిదండ్రులను విషాదంలో ముంచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.