పత్తి పంటలో అడవి పందుల ధ్వంసాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
తలమడుగు(బోథ్): జిల్లాలోని అటవీ ప్రాంతా ల్లో పంటలకు రక్షణ కరువైంది. అడవి పందులు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకున్నా పరిహారం అందకపోవడంతో అప్పుల్లో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. చుట్టూ అడవులు ఉండడంతో పందులు పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా పత్తి, కంది, జొన్న పంటలు సాగు చేస్తుంటారు. రబీలో వేరుశనగ, శనగ, మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు పందుల బెడదతో జంకుతున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన తలమడుగు, తాంసి, బేల, బజార్‌హత్నూర్, బోథ్ మండలాల్లో, అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ మండలాల్లో పంటలకు పందుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి, కంది పంటలు లక్షా 39 వేల హెక్టార్లలో సాగు చేశారు. 1200 ఎకరాల్లో పత్తి, జొన్న, కంది పంటలపై అడవి పందులు దాడి చేసి నష్టపర్చాయి. తలమడుగు మండలం పల్లి, బరంపూర్, దేవపూర్, కుచుపూర్, కజ్జర్ల, ఉమ్రీ, తాంసి మండలం వడ్డాడి, గోట్కుర్, జామిడి, కప్పర్ల, గిరిగామ్, అంబుగామ్, అట్నమ్‌గూడ, లింబుగుడ, భీంపూర్ మండలం పిప్పల్‌కోఠి, తాంసి(కే), అందర్‌బంద్, టెక్టిరాంపుర్, దన్నోర, కరంజి గ్రామాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. అటవీశాఖ నుంచి పరిహారం ఇప్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో గత ఏడాది 980 ఎకరాల్లో, ఈ ఏడాది సుమారు 1200 ఎకరాల్లో పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. వ్యవసాయ, అటవీ శాఖ అధికారులు పంటలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. రైతులు ఫొటోలతో సహా దరఖాస్తులు తీసుకున్నారు. అయినా పరిహారం అందలేదు. అడవిపందులు పంటలపై దాడులు చేస్తుండడంతో రాత్రింబవళ్లు రైతులు పొలాల వద్ద గుడిసెలు వేసుకుని కాపలా ఉంటున్నారు. పందులు వస్తే టపాసులు పేల్చుతూ బెదరగొడుతున్నారు. పంట చుట్టూ ఫెన్సింగ్, చీరలు కట్టి రక్షించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు పందుల దాడిలో గాయపడిన సంఘటనలు ఉన్నాయి. చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment