ఇక పైప్‌లైన్ గ్యాస్ | pipeline gas | Sakshi
Sakshi News home page

ఇక పైప్‌లైన్ గ్యాస్

Published Sat, Aug 2 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

ఇక పైప్‌లైన్ గ్యాస్

ఇక పైప్‌లైన్ గ్యాస్

  •      ఇంటింటి సరఫరాకు శ్రీకారం   
  •      పెండింగ్‌లో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
  •      డిసెంబర్ నాటికి రెండువేల కనెక్షన్లు
  •      ఏజెన్సీ సన్నాహాలు
  • సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ ఆధ్వర్యంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగంగా పైప్‌లైన్ల నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాలకు వంటగ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు నగర శివారులోని నల్సార్ విశ్వవిద్యాలయ క్యాంపస్, మేడ్చల్ మండల కేంద్రానికే పరిమితమైన వంటగ్యాస్ సరఫరా తాజాగా కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీంతో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియ చేపట్టారు.
     
    ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా...
     
    మహానగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ) సరఫరా చేసేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ సంస్థ నాలుగేళ్ల క్రితం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ముందుకు వచ్చింది. అప్ప ట్లో 32 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టి, అర్థంతరంగా నిలిపివేసింది. తొలుత నగర శివారులోని శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి, సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోగల 30 ఫ్లాట్‌లకు, మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు పైప్‌లైన్ల ద్వారా కనె క్షన్లు ఇచ్చింది. వాస్తవానికి మేడ్చల్‌లో సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి, అప్పటి ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కార్యక్రమం వాయిదా పడటంతో కొన్ని కనెక్షన్లను జారీ చేసి మిన్నకున్నారు. ఆ తర్వాత కొత్త కనెక్షన్ల జోలికి వెళ్లలేదు. తాజాగా పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాలకు గ్యాస్ సరఫరాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
     
    లక్ష్యానికి దూరం..
     
    గ్రేటర్ పరిధిలో పైప్‌లైన్ ద్వారా ఐదేళ్లలో సుమారు 2.66 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇంతవరకూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చే సేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టు సిద్ధమైనట్లు బీజేఎల్ ప్రకటించింది. ఆచరణలో మాత్రం విఫలమైంది. రెండేళ్లుగా పైప్‌లైన్ పనలు ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. మరోవైపు జీడిమెట్లల బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది.
     
    రెండు వేల కనెక్షన్లు...
     
    నగర శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి నుంచి సర్కిల్ కార్యాలయం వరకు డిసెంబరు నాటికి సుమారు రెండు వేల కనెక్షన్లు జారీ చేసేందుకు బీజేఎల్ అధికారులు చర్యలు చేపట్టారు. 2011లో నిర్మాణాలు పూర్తయినా,పైపులైన్లను పరిశీలిస్తూ లీకేజీలుంటే మరమ్మతులు చేపడుతూ కనెక్షన్లు ఇస్తున్నారు. ఇప్పటికే  చర్మాస్ ఫ్యాక్టరీ నుంచి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వరకు 1.5 కిలో మీటర్ల మినహా పైప్‌లైన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. పైప్‌లైన్ గ్యాస్ కోసం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 2,400 కుటుంబాలు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా గోదావరి హోమ్స్, గాయత్రీ నగర్ సమీపంలో ఉన్న సాయికృష్ణా రెసిడెన్సీ ఫ్లాట్ నెంబరు 204, 401 లకు గ్యాస్ సరఫరాకు శ్రీకారం చుట్టారు.
     
    శివారులకు విస్తరణ
     
    నగర శివారులోని కొంపల్లి, సినీ ప్లానెట్, ప్రజెయ్ అపార్టుమెంట్, జయభేరి, వెన్‌సాయి, ఎన్‌సీఎల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గోదావరి హోమ్స్, గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ, సుచిత్ర, వెన్నెలగడ్డ, బౌద్ధనగర్, వేంకటేశ్వర కాలనీ, కౌండిన్య క్లబ్, ఎన్‌సీఎల్ నార్త్, మీనాక్షి ఎన్‌క్లేవ్, స్ప్రింగ్ ఫీల్డ్, ఓం బుక్స్, రామరాజునగర్ ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకున్నా రు. అక్టోబరు నుంచి శ్రీకష్ణనగర్, భాగ్యలక్ష్మి కాలనీ, జయరాం నగర్, విమానపురి కాలనీ, కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్, కృష్ణకుంజ్ గార్డెన్, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీర అపార్టుమెంట్స్ ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
     
    కనెక్షన్‌కు మూడు కంట్రోళ్లు
     
    పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లకు మూడు కంట్రోళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి వంట గదిలోకి వెళ్లగానే మీటర్ వద్ద, రెండోది రబ్బర్ ట్యూబ్ ముందు, మైడో కంట్రోలర్ స్టౌ నాబ్ వద్ద ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ప్ర మాదాలకు ఆస్కారం ఉండదు. పేట్ బషీరాబాద్‌లోని మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద కంట్రోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా అవుతుంది. అటు కొంపల్లి, కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాల యం వరకు గ్యాస్ పైపులైన్‌లు అనుసంధానం చేశారు.
     
    ఐడీప్రూఫ్ ఉంటే చాలు...
     
    పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ల జారీకి ఐడీ ఫ్రూఫ్ ఉంటే చాలు. రూ.5 వేలు రిఫండబుల్ డబ్బులు చెల్లించి కనెక్షన్ తీసుకోవచ్చు. గ్యాస్ అయిపోతుందన్న దిగులు కూడా ఉండదు. 24 గంటలూ సరఫరా అవుతూనే ఉంటుంది. వినియోగదారులు ఎంత వాడుకుంటే... అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు రోజూ 0.5 ఎంసీహెచ్ గ్యాస్ వాడే అవకాశముందని బీజేఎల్ సిబ్బంది పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement