
నాటిన మొక్కకు నీళ్లు పట్టించే విధానంపై అవగాహన కల్పిస్తున్న ఎప్‌ఆర్వో, జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు
ఆదిలాబాద్‌రూరల్: దినదినం ఆడవులు అంతరించిపోతున్న దృష్ట్యా వాతావరణం కాలుష్యంగా మారడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ శాతాన్ని పెంచడంలో భాగంగా జాతీయ రహదారి 44కు ఇరువైపులా మొక్కలను నాటుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జైనథ్ మండలం మాండగడ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతం నిర్మల్ జిల్లా వరకు సుమారు 84 కిలోమీటర్ల పొడవు మేరకు వీటిని నాటనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారి 44కు ఇరువైపులా మూడు వరుసల్లో 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో గల నీడను ఇచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పూల మొక్కలను నాటుతున్నారు. నాటిన మొక్కలను పశువులు తినకుండా వాటి చుట్టూ ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి వాటిని రక్షించనున్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా ప్రతీ రోజు ట్యాంకర్ ద్వారా నీళ్లను పోస్తున్నారు.
చల్లని వాతావరణం
జాతీయ రహదారి 44కు ఇరువైపులా మూడు వరుసల్లో నాటుతున్న మొక్కలతో జాతీయ రహదారి గుండా ప్రయాణించే ప్రయాణికులకు చల్లని వాతావరణం అందనుంది. అలాగే వాహనాల నుంచి వెలుబడే పొగతో వాతావరణం కాలుష్యం కాకుండా అరికట్టేందుకు వీలు ఉంటుంది. నీడ నిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఒకే రకమైన పూల మొక్కలను కాకుండా కొన్ని కిలో మీటర్ల దూరంలో వివిధ రకాల పూల మొక్కలను నాటనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గాలి, దుమారం వచ్చినప్పుడు నాటిన మొక్క కింద పడిపోకుండా దానికి సపోర్టుగా మధ్యలో ఒక కర్రను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో చెట్టుకు రూ.300 ఖర్చు
అడవుల జిల్లా ఆదిలాబాద్‌గా పిలువబడే జిల్లాలో మరింత చెట్లను పెంచుతున్నారు. జాతీయ రహదారి నంబర్ 44కు ఇరువైపులా మూడు వరుసల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, ఇంద్రవెళ్లి, ఇచ్చోడ, నేరడిగొండ రేంజ్ పరిధిలో నాటుతున్న నీడనిచ్చే, పూలనిచ్చే ఒక్కో మొక్కకు రూ. 300 ఖర్చు చేస్తున్నారు. 84 కిలోమీటర్ల పొడవులో 22వేల మొక్కలను నాటనున్నారు. మొక్కలు పెద్దవి అయ్యేంత వరకు ఆ మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పోయడంతో పాటు ఎరువులను సైతం పోయనున్నారు. ఇరువైపులా నాటుతున్న మొక్కలతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment