మొక్కలు నాటితేనే నిధులు
పంచాయతీలకు తేల్చిచెప్పిన మంత్రి పోచారం
బాన్సువాడ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రామాలకు నిర్దేశించిన 40వేల మొక్కలు నాటాలని, లక్ష్యం పూర్తి చేసిన గ్రామ పంచాయతీలకే నిధులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మేలు చేయాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా 11 మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలన్నారు. మూడేళ్లుగా రాష్ట్రం కరువు బారిన పడడానికి చెట్లు నరకడమే కారణమని తెలిపారు.
లండన్, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఒక్క ప్రాజెక్టు, బోరు కానీ, చెరువు కానీ లేదని, అక్కడ 55 శాతం అడవులు ఉండడం వల్ల ఏడాది పొడవునా వారంలో ఒకసారి వర్షం కురుస్తుందని, దీంతో అక్కడి రైతులు సమృద్ధిగా పంటలను పండిస్తున్నారని అన్నారు. రాష్ట్ర విస్తీర్ణం 1.14 కోట్ల చదరపు మీటర్లు కాగా, 35 శాతం విస్తీర్ణంలో చెట్లు ఉండాలని, కానీ కేవలం 21 శాతం భూమిలో మాత్రమే చెట్లు మిగిలాయని ఆవేదన చెందారు. అందుకే ప్రభుత్వం హరితహారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టిందని తెలిపారు. హరితహారంలో భాగంగానే 10 లక్షల ఈత చెట్లను పెంచనున్నట్లు మంత్రి చెప్పారు. ఆంధ్ర ప్రాంతంలోని కడియంలో పెంచుతున్న ఈత చెట్లు రోజుకు ఒక్కొక్క చెట్టు 50 లీటర్ల కల్లునిస్తుందని, స్వచ్ఛమైన కల్లుతో ఎలాంటి రోగాలు రావని అన్నారు. కొందరు కల్తీ కల్లు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే భారీగా ఈత చెట్లను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ యోగితారాణా, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.