సాక్షి, హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ వాసుల కలల మెట్రో రైలు మరో రెండు రోజుల్లోనే కూత పెట్టనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా 28వ తేదీన (మంగళవారం) మధ్యాహ్నం మెట్రో రైలును ప్రారంభించనుండగా.. 29వ తేదీ నుంచే ప్రయాణికులందరికీ అందుబాటులోకి వస్తోంది. నాగోల్–అమీర్‌పేట–మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మార్గంలో.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది. తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి సమయాలను ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు పెంచనున్నారు.
మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ఈ వివరాలను వెల్లడించారు. శనివారం నాగోల్–మెట్టుగూడ మధ్య మెట్రో రైలులో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు తలసాని, పద్మారావు, మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం నెబ్యులా మెట్రో స్మార్ట్ కార్డు, స్వచ్ఛ మెట్రో క్యాంపెయిన్‌కు సంబంధించిన పోస్టర్లను లాంఛనంగా విడుదల చేశారు. అనంతరం నాగోల్ మెట్రోరైలు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఎన్నో సవాళ్లు ఎదుర్కొని సాధించాం
ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని మెట్రో రైలు ప్రాజెక్టును సాకారం చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రారంభంలో ఎదురవుతున్న బాలారిష్టాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తామని చెప్పారు. మెట్రో ప్రయాణ, పార్కింగ్ చార్జీలు ఇతర మెట్రో నగరాల్లోని చార్జీలతో దాదాపు సమానంగా ఉంటాయన్నారు. వచ్చే ఏడాది చివరినాటికి ఎల్‌బీనగర్–మియాపూర్ (29 కిలోమీటర్లు), జేబీఎస్–ఫలక్‌నుమా(15 కిలోమీటర్లు), నాగోల్–రాయదుర్గం (29 కిలోమీటర్లు) మార్గాలన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు.
‘టి–సవారీ’యాప్‌తో అన్ని వివరాలు
28న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్ మెట్రోరైలు డిపో వద్దకు చేరుకుంటారని.. అక్కడ మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి–సవారీ’మొబైల్ యాప్‌ను విడుదల చేస్తారని కేటీఆర్ తెలిపారు. అనంతరం మియాపూర్ నుంచి కూకట్‌పల్లికి తిరిగి మియాపూర్ వరకు మెట్రోరైలులో ప్రయాణిస్తారని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పారిశ్రామికవేత్తల సదస్సుకు వెళతారని చెప్పారు. అయితే ప్రధాని సూచనల మేరకు మియాపూర్ మెట్రోరైలు డిపో ఆవరణలో బహిరంగ సభ, మీడియా సమావేశాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ ‘టి–సవారీ’యాప్‌తో ప్రయాణికులు రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎంత సేపట్లో చేరుకోవచ్చు.. స్టేషన్‌లో దిగిన తరవాత బస్సు, క్యాబ్ లేదా ఆటోలో ఎంతసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న అంశాలు తెలుసుకోవచ్చని చెప్పారు.
మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ ఫీడర్ బస్సులు
నాగోల్–అమీర్‌పేట–మియాపూర్ మార్గంలోని 24 స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ఆర్టీసీ 50 ఫీడర్ బస్సులను నడపనుందని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతి పది నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుందని.. మెట్రో పూర్తిస్థాయిలో ప్రారంభమైన తరవాత 64 స్టేషన్ల నుంచి 1,700 ఫీడర్ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నడుపుతామని చెప్పారు. ఇక మెట్రో స్టేషన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేందుకు మహీంద్రా, ఉబర్ సంస్థలతో ఒప్పందం కుదరనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 64 మెట్రో స్టేషన్ల వద్ద దశలవారీగా సైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు
పార్కింగ్.. స్మార్ట్‌కార్డుల వినియోగంపై దృష్టి
తొలిదశ మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లకుగాను 13 చోట్ల పార్కింగ్ వసతులు కల్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిగతా స్టేషన్ల వద్ద అధునాతన పార్కింగ్ ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించామని చెప్పారు. ఇక మెట్రో నెబ్యులా స్మార్ట్‌కార్డులు తొలుత మెట్రో ప్రయాణానికే పనికొస్తాయని.. తర్వాత వాటితో క్యాబ్‌లు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, షాపింగ్, బ్యాంకింగ్ కార్యకలాపాలు సహా 16 రకాల సేవలు పొందేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక ప్రతి మెట్రోస్టేషన్ల సమీపంలోని వాణిజ్య మాల్స్, కార్యాలయాలు, ఐటీ సెజ్‌లను స్కైవాక్‌లతో అనుసంధానిస్తామని.. ఇందుకు ఆయా సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయని తెలిపారు.
వ్యయం వివరాలు ఏడాది తర్వాతే..
మెట్రోరైలు ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. మొత్తం ప్రాజెక్టుకు చేసిన వ్యయం, పెరిగిన నిర్మాణ వ్యయం తదితర అంశాలను వచ్చే ఏడాది మెట్రో ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఇక మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వివరించారు. పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్‌పై త్వరలో స్పష్టత రానుందని తెలిపారు. ఇక ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్‌యార్డును తొలగిస్తామని, మెట్రో డిపో నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.
మెట్రోలో నియామకాలు ముగిశాయి
మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లను, ఇతర ఉద్యోగులను నియమించుకున్నామని కేటీఆర్ చెప్పారు. మెట్రో ప్రాజెక్టులో రిక్రూట్‌మెంట్ మూడేళ్ల కిందే పూర్తయ్యిందని, ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి రిక్రూట్‌మెంట్ జరగడంలేదని తెలిపారు.
మెట్రోరైలు ప్రయాణ సమయం ఇలా..
నాగోల్– అమీర్‌పేట (17 కిలోమీటర్లు) మధ్య ప్రతి 10– 15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. 25 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.
మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ) మధ్య కూడా ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment