సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. నేడు అంతర్జాయ మార్కెట్‌లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. అమెజాన్, వీవ్‌మార్ట్ లాంటి బహుళజాతీయ కంపెనీలు ఇక్కత్ వస్త్రాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు, దేశాల ప్రజలకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మరింత చేరువయ్యాయి. సినిమాలు, సీరియల్స్‌లో హీరో, హీరోయిన్లు, యాంకర్లు, పారిశ్రామిక వేత్తలు పోచంపల్లి చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు. వెండితెరపై కూడా చేనేత వస్త్రాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చేనేతలకు మంచి క్రేజ్ పెరిగింది.
అధ్యయన కేంద్రంగా....
ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు చేనేత వస్త్ర తయారీ తీరు తెన్నులు తెలుసుకోవడానికి నిత్యం వస్తుంటారు. అంతేకాక ముంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగుళూరు రాష్ట్రాలకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), బిజినెస్ స్కూల్ ఆఫ్ ఇండియా, పలు ఫ్యాషన్ టెక్నాలజీ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చి చేనేతపై అధ్యయనం చేస్తుంటారు. అదేవిధంగా చేనేతను పాఠ్యాంశంగా చేర్చడంతో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు అధ్యయన నిమిత్తం ఇక్కడి వస్తుంటారు.
అధ్యయన అంశాలు ఇవే...
అమెరికా, జర్మనీ దేశాల అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్స్‌ను వాడుతున్నారంటే ఇక్కడి చేనేత కార్మికుల కళా నైపుణ్యం తెలుస్తోంది. ముఖ్యంగా పలు దేశాల ప్రజలు ఇక్కత్ చేనేత వస్త్రాలైన డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టెన్స్, బెడ్ షీట్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. ముస్లిం దేశాల్లో స్టోల్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ తమ వస్త్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రతిఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తుంది. అంతేకాక పలువురు ఔత్సాహిక యువకులు ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కత్ వస్త్ర విశిష్టతను తెలుసుకోవడానికి వచ్చే విదేశీయులు చేనేత గృహాలు, చేనేత సహకార సంఘం, హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించి అక్కడ నూలు వడికే విధానం, చిటికి కట్టడం, గ్రాఫ్‌పై డిజైన్లు వేయడం, అచ్చు అతకడం, రంగుల అద్దకం, మగ్గాలు, వస్త్రాలు నేసే విధానం, మార్కెటింగ్, చేనేత కళాకారుల జీవన స్థితిగతులు, కూలీ, ఇక్కడి ఆచార, వ్యవహారాలను అధ్యయనం చేస్తుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన విద్యార్థులు మాత్రం నూతన డిజైన్లను అధ్యయనం చేస్తుంటారు.
పోచంపల్లి బాట పట్టిన 100కు పైగా దేశాలు..
చేనేతతో పాటు భూదానోద్యమానికి పురుడుపోసుకున్న పోచంపల్లిని ఇప్పటివరకు 100కు పైగా దేశాలు, వేలాది మంది విదేశీ ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వీఐపీలు సందర్శించడంతో ప్రపంచపటంలో పోచంపల్లికి తగిన గుర్తింపు వచ్చిం ది. అంతేకాక వివిధ రా ష్ట్రాల మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఫ్యాషన్, సినీరంగ ప్రముఖులు సందర్శించి చేనేతను అధ్యనం చేసి ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(నిర్డ్), జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమల సంస్థ (నిమెస్మీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), గ్రామీణాభివృద్ధి జాతీయ మండలి (ఎన్‌సీఆర్డీ), కపార్డ్, ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ), టూరిజం శాఖ, జాతీయ సస్య రక్షణ శిక్షణ సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి), అపార్డ్, గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, హాలెండ్, దక్షిణాఫ్రికా, మలేషియా, బోట్స్‌వానా, టునీషియా, మంగోలియా, ఇథియోఫియా, ఘనా, లావోస్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, సిరియా ఉజ్భకిస్థాన్, మయన్మార్, నేపాల్, సూడాన్, ఉగాండా, ఐర్లాండ్, కజకిస్థాన్, పెరూ, డర్భన్, నైజీరియా, జింబాంబ్వే, హంగరీ, టాంజానియా, ఐలాండ్, సోలోమన్, ఈక్విడార్, యెమన్, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, వియత్నాం, లిబియా, స్విడ్జర్లాండ్, జోర్ధాన్, కాంగో, పోర్సుగీస్ మొదలగు దేశాల వారున్నారు.
చేనేత కళ గొప్పది..
ఇండియాకు మొదటిసారి వచ్చా. ప్రాచీన చేనేత కళను తెలుసుకోవడానికి పోచంపల్లిని సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చి ంది. ఇక్కడి చేనేత కళాకారులు రూపొందిస్తున్న చేనేత వస్త్రాలు చాలా బాగున్నాయి. అయితే ఇంటిల్లిపాది కలిసి పని చేయడం, సమష్టిగా బాధ్యతలు పంచుకోవడం ఎంతో నచ్చింది. నూతన ప్రయోగాలతో చేనేత కళను కాపాడుకోవాలి.
– మిల్లిహట్టన్, కెనడా
మంచి ఆదరణ ఉంది
ప్రస్తుతం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వస్త్ర తయారీ ప్రక్రియలను అధ్యయనం చేస్తుంటారు. గత యాభై ఏళ్లుగా చేనేత కళాకారులు అనేక మార్పులు, వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సా«ధిస్తున్నారు. చేనేతను ఉపా«ధి కేంద్రంగా గుర్తించి ప్రోత్సహిస్తే చేనేత పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.
– భారత లవకుమార్, హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్, పోచంపల్లి
Comments
Please login to add a commentAdd a comment