
'తప్పులు కప్పి పుచ్చుకునేందుకే సెక్షన్ -8'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకే సెక్షన్- 8 ప్రస్తావన తెచ్చారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తునంటూ విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతుల కోసం రూ.30,990 కోట్ల రుణ పరిమితి విధానాన్ని ఆమోదించినట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో రైతులకు బ్యాంకుల నుంచి రూ.23,200 కోట్ల రుణాలు అందజేశామని.. దాంతో పాటుగా 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ పత్రాలు అందించామని పోచారం పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులోనే ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ చక్కగా వ్యవహరిస్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.