సాక్షి, అమరావతి: ప్రజా ధనం లూటీ చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడిని క్షమించి వదిలేయాలా అంటూ తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసింది చిన్న తప్పు కాదని తెలిపారు. మంత్రి బొత్స శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధికారం ఉందని తప్పులు చేస్తే క్షమించరాని నేరమవుతుంది. ఇలాంటి తప్పులు చేసిన వారిని క్షమించి వదిలేయాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం విచిత్రంగా ఉంది’ అని బొత్స మండిపడ్డారు.
‘గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వ చర్యలు, న్యాయస్థానం తీర్పు ప్రజలకు తెలిసిన విషయమే. చంద్రబాబు ఒప్పందం రద్దు చేసుకున్న సీమెన్స్ కంపెనీ పేరుతో ఎలాంటి బిల్లులు లేకుండా రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. సీమెన్స్‌తో ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారో, ఏయే తేదీల్లో డబ్బులు ఆ కంపెనీకి చెల్లించారో చంద్రబాబు చెప్పడంలేదు. ఇంత మొత్తం డబ్బును ఏ కంపెనీలకు చెల్లించారో కూడా వెల్లడించడంలేదు.
ఇలాంటి అవినీతిపరుడికి తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం వత్తాసు పలకడం శోచనీయం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉద్దేశపూర్వంగా అక్రమాలు చేస్తే చూసీ చూడనట్టు వదిలేయాలనడం దారుణం. ఇలాంటి తప్పు తెలంగాణలో జరిగితే అక్కడి సీఎం కేసీఆర్ చూసీచూడనట్టు వదిలేస్తారా’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి కేసులో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఆధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. చంద్రబాబు ఇలాంటి తప్పులు ఎన్నో చేశారని చెప్పారు.
ఆ పత్రికలు సొంత భాష్యం చెబుతున్నాయి
ప్రభుత్వంలో ప్రతి ఫైల్‌కు, ప్రతి సంతకానికి ఎంతో విలువ ఉంటుందని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రొసీడింగ్స్‌కు, రూల్స్‌కు విరుద్ధంగా సంతకాలు చేసి ప్రజాధనం దారిమళ్లించారని చెప్పారు. సాక్ష్యాత్తు ఈడీ, ఇన్‌కంట్యాక్స్ విభాగాలు దీనిని తేల్చి చెప్పాయన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్యాలు రాస్తున్నాయన్నారు.
చంద్రబాబు ఫైళ్లపై చేసిన సంతకాలు, కంపెనీ పేర్లు లేకుండా నిధులు విడుదల చేసిన ఆదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఓ వర్గం మీడియా మాత్రం బాబును భుజానకెత్తుకుని చట్టాలకు, రూల్స్‌కు అతీతంగా సొంత భాష్యం చెప్పడం విచారకరమన్నారు. నిధుల మళ్లింపు రూల్స్ విరుద్ధంగా చేశారా లేదా అని చంద్రబాబునే అడిగితే సమాధానం వస్తుందన్నారు. రూల్స్ పాటించే చేశానని చెప్పే ధైర్యం ఆయన చేయరని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు గత ప్రభుత్వంలో ఎలా పనిచేశాయి, ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా పరిశీలించి చెప్పాలని ఆయన అన్నారు.
అక్రమార్కుడు చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ మద్దతెలా ఇస్తారు?
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
పెంటపాడు: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మద్దతివ్వడంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్ శ్రీనివాసరెడ్డి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుకు మద్దతివ్వడం శోచనీయమన్నారు.
రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని తెలిపారు. స్కిల్ కుంభకోణంలో పాత్ర ఉన్న వారందరినీ నిందితులుగా చేర్చే విషయం సీఐడీ చూసుకుంటుందన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెబుతారని ప్రశి్నంచారు.
Comments
Please login to add a commentAdd a comment