శాస్త్రవేత్తలు అయ్యాకే పెళ్లిపీటలు ఎక్కారు.. | Polasa Agriculture Women Scientists Success Story | Sakshi
Sakshi News home page

పట్టుదలతో లక్ష్యం చేరిన యువతులు

Published Wed, Oct 30 2019 8:24 AM | Last Updated on Wed, Oct 30 2019 11:55 AM

Polasa Agriculture Women Scientists Success Story - Sakshi

బి.మాధవి–రాజు, సాద్వి–మహేష్‌రెడ్డి, ప్రజ్ఞ–గోన్యానాయక్‌

సాక్షి, జగిత్యాల : తల్లితండ్రులు ఒత్తిడి చేస్తున్నారని.. అబ్బాయిలు ప్రేమ పేరుతో వెంట పడుతున్నారని.. వయస్సు పెరిగిపోతోందని.. ఉద్యోగం రాక ఇక చదువు అయిపోయిందనే తదితర కారణాలతో అనుకున్న లక్ష్యాలు, కోరికలు నెరవేరకుండానే నేటి యువతులు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఆ తర్వాత పెద్ద ఉద్యోగం రాక.. చిన్నచిన్న ఉద్యోగాలు చేయలేక.. పిల్లల బాధ్యత మోయలేక.. రకరకాల ఆర్థిక, కుటుంబ సమస్యలతో విలవిలలాడుతున్నారు. గృహిణిగా అత్తింటి వేధింపులు, భర్త చీదరింపులు, భార్యాభర్తల మధ్య ఏదో విషయంపై రోజు గొడవలతో.. ఏదో ఇలా గడిచిపోతోందంటూ యువతులు తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన పలువురు మహిళలు విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, లక్ష్యం సాధించేవరకు అహోరాత్రులు కష్టపడి, విజయం సాధించిన తర్వాతే తాను మెచ్చిన, తనకు నచ్చిన జోడిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నారు.

జగిత్యాల మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన పలువురు యువ మహిళలు కలలుకన్న ‘శాస్త్రవేత్త’ అనే ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడ్డారు. 25–27 ఏళ్ల వయస్సులోనే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించారు. ఇప్పుడు తనకు నచ్చిన, మెచ్చిన వరుడిని పెళ్లి చేసుకున్నారు. భర్త, పిల్లలతో ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారే పరిశోధన స్థానానికి చెందిన ఆరుగురు యువ మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్‌ డి.రజినిదేవి, బి.మాధవి, సాధ్వి, ప్రజ్ఞ, యమున, స్వాతి. యువ మహిళా శాస్త్రవేత్తల మనోభావాలు వారి మాటల్లోనే..

ఇద్దరం శాస్త్రవేత్తలమే..
నాది భువనగిరి ప్రాంతంలోని మోతుకూర్‌ మండలం పాలడుగు గ్రామం. చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో బీఎస్సీ అగ్రికల్చర్‌ అశ్వారావుపేటలో, ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. చదువు పూర్తి కాగానే ఏడాదిపాటు వ్యవసాయశాఖలో ఏఈఓగా పనిచేసిన. 2018లో శాస్త్రవేత్తగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతే హన్మకొండ ప్రాంతంలోని ఐనవోలు మండలం ముల్కలగూడెంకు చెందిన రాజుతో పెళ్లయింది. మావారు కూడా పొలాసలో శాస్త్రవేత్తే. మహిళలు ఇంటికి పరిమితమైతే చదివిన చదువుకు సార్థకత ఉండదు. – బి.మాధవి–రాజు దంపతులు

తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి
మా ఊరు సిద్దిపేట. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పిన. ఆ మేరకు కష్టపడి చదివి శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించిన. బీఎస్సీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ను రాజేంద్రనగర్‌లో చదివి, ఆ తర్వాత శాస్త్రవేత్తగా ఎంపికయ్యా. వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహేష్‌తో 2019లో పెళ్లి జరిగింది. పెళ్లి కంటే ముందు ఉద్యోగం సాధించాలంటే తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి. – సాద్వి–మహేష్‌రెడ్డి దంపతులు

చిన్నప్పటి నుంచి కష్టపడటంతోనే.. 
నాది వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. ఆ మేరకు ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ లక్ష్యం కోసం తపించాను. బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ బాపట్లలో, ఎంటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. పొలాసలో రిసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు 2016లో పెళ్లయ్యింది. 2017లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా జాబ్‌ వచ్చింది. నా భర్త గోన్యానాయక్‌ది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఆయన సైతం పొలాసలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు.  – ప్రజ్ఞ–గోన్యానాయక్‌ దంపతులు                        

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతే.. 
మాది వికారాబాద్‌. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలని అనుకున్నా. ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తానన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతే చేసుకుంటానని చెప్పిన. బీఎస్సీ హార్టికల్చర్‌ అశ్వరావుపేటలో, ఎమ్మెస్సీ హార్టికల్చర్‌ రాజేంద్రనగర్‌లో, పీహెచ్‌డీ పశ్చిమబెంగాల్‌లో పూర్తి చేసిన. అదే సమయంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యా. తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకున్నా. మా జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ప్రతీ విద్యార్థిని పట్టుదలతో ముందడుగు వేస్తేనే విజయం.– స్వాతి–శ్రీనివాస్‌ దంపతులు

ఏదైనా సాధిస్తేనే ఆనందం 
మాది జోగులాంబ గద్వాల జిల్లా. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. ఏదైనా సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన. తల్లిదండ్రులకు నమ్మకం కలిగించిన తర్వాత లక్ష్యం కోసం కృషి చేయడం ప్రారంభించిన. బీఎస్సీ అగ్రికల్చర్‌ అశ్వరావుపేటలో, ఎమ్మెస్సీ రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. కష్టపడి చదివి 2018లో వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించిన. ఇటీవలే రైల్వేలో సీనియర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అభినయ్‌రెడ్డితో వివాహమైంది. ఇప్పుడు జీవితం హ్యాపీ. ప్రతీ మహిళకు ఏదో సాధించాలనే తపన ఉండాలి.– యమున–అభినయ్‌రెడ్డి దంపతులు

ఆనందమయ జీవితం.. 
మాది హుజూరాబాద్‌. చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావడమే లక్ష్యంగా ఉండేది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ(అగ్రికల్చర్‌) రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. చదువు పూర్తి కాగానే కొద్దిరోజుల పాటు ఉద్యోగం చేసిన. ఆ సమయంలో జగిత్యాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వేణుగోపాల్‌తో 2011లో పెళ్లి అయ్యింది. అహోరాత్రులు కష్టపడి 2018లో శాస్త్రవేత్తగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో మా జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థిక స్వాతంత్య్రం కోసమైనా మహిళలు ఉద్యోగం చేయడం మంచిది.          – డాక్టర్‌ రజనీదేవి–వేణుగోపాల్‌ దంపతులు 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

స్వాతి–శ్రీనివాస్‌, యమున–అభినయ్‌రెడ్డి, డాక్టర్‌ రజనీదేవి–వేణుగోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement