ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పార్లమెంట్‌లో పోలవరం ముంపు మండలాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపులోని ఆదివాసీలు, గిరిజనులను పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. కేంద్రం కూడా వీరి విషయంలో ఎందుకు స్పందించటం లేదని ఎంపీలు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా సభలో ముంపు మండలాల సమస్యలను ఏకరువు పెట్టారు. ఎంపీలు సీతారాంనాయక్, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా గొంతెత్తారు.
పార్లమెంట్‌లో మంగళవారం పునర్విభజన చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినా.. పాలన, అభివృద్ధి పరంగా ముందడుగు లేదు. కనీసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల సమాచారం కూడా ముంపులోని ఆదివాసీలు, గిరిజనులకు తెలియడం లేదు. అసలు ముంపు వాసులను అక్కడి ప్రభుత్వం గాలికివదిలేసింది. మొత్తంగా ఐదు మండలాలు పూర్తిగా, రెండు మంలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. 324 రెవెన్యూ గ్రామాల్లోని 1,90,304 మంది జనాభా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని, ముంపులో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఎంపీ పొంగులేటి ముంపు మండలాల సమస్యలను ఒక్కొక్కటిగా సభలో ప్రస్తావించారు. ముంపు సమస్యలను ఎంపీలు ప్రస్తావించినా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం సభ్యులు ప్రస్తావించిన ప్రశ్నలకు సమాధానం అసమగ్రంగా ఇవ్వడంతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
ఎంపీ పొంగులేటి లేవనెత్తిన అంశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీకి ముంపు మండలాల్లో టీటీసీ, బీఎడ్ పూర్తి చేసిన సుమారు 1,100 మంది దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారు. నాన్‌లోకల్ పేరుతో వీరిని పక్కన పెట్టారు. గిరిజన నిరుద్యోగులు అక్కడ డీఎస్సీకి అర్హత కోల్పోయారు.
ముంపు మండలాల్లో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. గిరిజనులకు ఆదరువుగా ఉన్న ఉపాధి హామీ పథకం ఈ మండలాల్లో అమలు కావడం లేదు. గిరిజనులు ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. రోడ్లు, పాఠశాలల భవనాలు, ఇతర నిర్మాణాలు ఈ ప్రాంతాంలో చేపట్టకపోవడంతో అభివృద్ధి ఆనవాళ్లు లేవు.
భద్రాచలం రూరల్ మండలంలోని గ్రామాలు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఈ రెండు మండలాల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో పరిధిలోకి వెళ్లిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో ప్రభుత్వాలు ప్రమాణ స్వీకారం చేయించలేదు.ఈ మండలాల్లోని ప్రజల సమస్యల కోసం ప్రజాప్రతినిధులు నినదించే అవకాశం లేకుండా పోరుుంది.
గతంలో భద్రాచలం మండలంలోని ఎటపాక, పిచుకలగూడెం, కన్నాయిగూడెం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. ఈ గ్రామాల మీదుగానే తెలంగాణలో ఉన్న దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్ళాలి. ఈ పరిస్థితితో సరిహద్దు సమస్య ఏర్పడుతుంది.
324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రలో కలిపి ఎనిమిది నెలలైనా అక్కడి ప్రజలకు విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుంది.
ముంపు మండలాల్లో 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 1,500 మంది తెలంగాణలో ఉంటామని ఆప్షన్ పెట్టుకుంటే ఇరు ప్రభుత్వాలు సరైన రీతితో స్పందించడం లేదు.
ఎంపీలు సీతారాంనాయక్, వినోద్, గుత్తా ప్రస్తావించిన సమస్యలు..
ముంపు మండలాల పేరుతో జిల్లాలోని గిరిజన, ఆదివాసీలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా వారి బాగోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడడం లేదు. ఈ మండలాలకు ఇంకా తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా అవుతుంది. వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లో రోడ్డు సౌకర్య లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపులోని ఆదితవాసీలను ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవడం లేదు. కేంద్రం వారిని ఆదుకోవాలి.
సభలో సమరం.. 'ముంపు' గళం
Published Wed, Mar 18 2015 8:08 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement