సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోలవరం ముంపు ప్రాంతం కింద జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం జిల్లాలో చర్చనీయాంశమయింది. ఆర్డినెన్స్‌ను ఆమోదించే బిల్లును సోమవారం పార్లమెంటులో పెడుతున్నారని, దీనిని ఆమోదిస్తే అది చట్టంగా మారి అనివార్యంగా ఏడు మండలాలు ఆంధ్రలోకి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందిన స్థానిక గిరిజనులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత ఊరట కలిగించింది.
అయితే, ఆర్డినెన్స్ వాయిదా వ్యవహారం తాత్కాలికమైనదేనని, ఎప్పుడైనా ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే ఆందోళన స్థానిక ఆదివాసీలలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని అఖిలపక్ష పార్టీలు, ఆదివాసీ సంఘాలు, టీజేఏసీలు నిర్ణయించాయి. మరోవైపు, భద్రాచలం పట్టణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకే ఆర్డినెన్స్ బిల్లును వాయిదా వేశారనే ప్రచారం తెలంగాణవాదుల్లో మరింత గుబులు పుట్టిస్తోంది.
అసలేం జరిగింది?
వాస్తవానికి పోలవరం ఆర్డినెన్స్‌ను ఆమోదించే బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, ఆర్టికల్ 3 కింద పార్లమెంటులో పెట్టాల్సిన బిల్లులను రాష్ట్రపతి సిఫారసు మేరకు సభలో పెట్టాల్సి ఉంటుంది. ఆర్టికల్ 3 కింద సభలో ప్రవేశపెట్టే పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు ఆయన సిఫారసు ఇంకా రానందున తాత్కాలికంగా బిల్లు వ్యవహారాన్ని పక్కన పెట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పీకర్‌ను కోరడంతో పోలవరం ఆర్డినెన్స్ వ్యవహారం తాత్కాలికంగా వాయిదా పడింది.
అయితే, ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్ మరో మెలిక పెట్టింది. రాష్ట్రాల సరిహద్దుల మార్పులకు సంబంధించిన బిల్లులను ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు పంపి, వాటి అభిప్రాయం తీసుకున్న తర్వాతే పార్లమెంటులో పెట్టాలని ఆ పార్టీ అంటోంది. కానీ, బంతి రాష్ట్రపతి కోర్టులో ఉం దని, రాష్ట్రాల అసెంబ్లీలకు పంపి, ఆ తర్వాత పార్లమెంటుకు పంపాలా, లేక నేరుగా పార్లమెం టుకే రాష్ట్రపతి పంపుతారా అనేది ఇప్పుడు కీల కం కానుందని రాజకీయ వర్గాలంటున్నాయి.
మళ్లీ నూగూరు కిందికేనా?
పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం తాత్కాలికంగా పక్కనపెట్టిన నేపథ్యంలో కొత్త చర్చ ప్రారంభమయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ‘1956కు ముందు’ అనే వాదనను తీసుకొస్తున్నందున అదే కోణంలో భద్రాచలం పట్టణాన్ని కూడా ఆంధ్రలో కలిపేస్తారని, అందుకే ఆర్డినెన్స్ ను వాయిదా వేసారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి 1956కు ముందు భద్రాచలం డివిజన్ తూర్పుగోదావరి జిల్లా నూగూరు తాలూకాలో ఉండేది.
పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో ఈ డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు 1956కు ముందు స్థానికత ఉండాలని ప్రభుత్వం అంటుండడంతో పాటు మున్ముందు కూడా 1956 అన్నప్పుడల్లా భద్రాచలం విషయంలో సమస్యలు వస్తాయని, అందుకే కేంద్రం భద్రాచలాన్ని కూడా ఆంధ్రలో కలుపుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఆందోళనలు మరింత ఉధృతం..
ఈ నేపథ్యంలో ఆందోళనలను మరింత ఉధృ తం చేసేందుకు అటు అఖిలపక్షం, ఇటు టీజేఏసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు రిలేదీక్షలు, ప్రదర్శనలు, బహిరం గ సభలు, పాదయాత్రలకు పరిమితమైన ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయిం చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతు న్న నేపథ్యంలో ఈ నెల 14న ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. ఇందుకోసం అఖిలపక్షం, టీజేఏసీ లు, ఆదివాసీ సంఘాలు కార్యాచరణ రూపొం దించుకుంటున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవలను బహిష్కరించే కార్యక్రమా న్ని మున్ముందు చేపడతామని, అందుకు తగిన సమయంలో పిలుపునిస్తామని ఓ నేత చెప్పారు.
చిన్ని చిన్ని ఆశ...
Published Tue, Jul 8 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement