సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ)లో కరోనా కలకలంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం సరోజిని ఆస్పత్రిలో టీఎస్‌పీఏ సిబ్బంది, క్యాడెట్లకి ఉచిత కరోనా నిర్ధారణ క్యాంపు ఏర్పాటు చేయించారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అకాడమీలో ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ రాగా, సిబ్బంది, క్యాడెట్లకి రూ.2,800 చొప్పున ప్రైవేటు ల్యాబ్ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్షలు చేయించాలని తొలుత ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు పెల్లుబికాయి. పోలీస్ అకాడమీలో సామాజిక దూరం పాటించడం లేదని, కరోనా పాజిటివ్ వస్తే మాత్రం తమ డబ్బుతో పరీక్షలు చేయించుకోవాలా? అంటూ సిబ్బంది ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు లేవనెత్తారు. ఈ విషయాన్ని సాక్షి ‘పోలీస్ అకాడమీ కరోనా కలకలం’ అన్న శీర్షికతో వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన అకాడమీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment