నకిలీ నోట్ల ముఠా అరెస్టు
మల్కాజిగిరి(హైదరాబాద్): వెయ్యి రూపాయల దొంగనోట్లను చలామణీ చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులతో పాటు వారికి సహకరించిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ రమారాజేశ్వరి, ఏసీపీ రవిచందన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సోహాన్ చోయల్ అనే వ్యక్తి యాదవనగర్‌లోని జేబీఎస్ స్టీల్ సామాన్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీ ఒక యువకుడు అతని వద్దకు వచ్చి వంద రూపాయల సామాన్లు కొని, వెయ్యిరూపాయల నోటు ఇచ్చాడు. నోటుపై అనుమానం వచ్చిన చోయల్ దగ్గరలోని మరో దుకాణంలో దొంగనోట్లు గుర్తించే మిషన్‌లో చెక్ చేయడంతో నకిలీదిగా తేలింది. దీంతో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేసిన పోలీసులు బండ్లగూడలో ముఠా సభ్యులు ఉన్న ఇళ్ల పై దాడి చేశారు. ఝార్ఖండ్ రాష్ట్రం సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందిన సయ్యద్‌అలీ(25), షేక్‌బాకర్(20), సుల్తాన్ షేక్(23), ఆలం(23), సనాల్(22), మహ్మద్ షమీం షేక్(21) పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన జియా ఉల్‌హక్(32) తో పాటు ఇంటిని అద్దెకు ఇచ్చిన బండ్లగూడకు చెందిన బిల్డింగ్ మెటీరియల్ సప్లై వ్యాపారి షేక్ సుల్తాన్(57), ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా నకిలీ పత్రాలతో నిందితులకు మూడు ఎయిర్‌టెల్ సిమ్‌లు అమ్మిన బండ్లగూడకు చెందిన సహస్ర మొబైల్స్ యజమాని మల్లారెడ్డి(26)లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి లక్షా యాబై వేల రూపాయల నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, ఇరవై వేల ఏడు వందల రూపాయల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్ దుకాణ యజమాని మల్లారెడ్డికి చెందిన కంప్యూటర్, పింటర్, స్కానర్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక టీం ఏర్పాటు: డీసీపీ
దొంగనోట్ల చలామణీకి పాల్పడున్న ముఠాలో ప్రధాన నిందితుడు సబాన్‌షేక్, బర్కత్‌షేక్, సామ్యూల్‌తో పాటు ఇంటిని అద్దెకు ఇచ్చిన రాజ్ మహ్మద్, ఎయిర్‌టెల్ డీలర్ రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నవీన్‌లను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ముఠాలోని సభ్యులకు సభాన్‌షేక్ దొంగనోట్లను అందజేసేవాడని వాటిని మార్చిన తర్వాత వచ్చిన నగదును అతను చెప్పిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే వారన్నారు. సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేక సూచనలు జారీ చేశారని ఇంటికి అద్దెకు ఇచ్చేముందు టెనెంట్ వెరిఫికేషన్ ఫారంను తప్పకుండా తీసుకోవాలన్నారు. అవసరమైతే వారి వివరాలను పోలీసులకు అందజేయాలన్నారు. సిమ్‌కార్డులు అమ్మే దుకాణ యజమానులు కూడా వినియోగదారుడి వివరాలు పూర్తిగా తెలుసుకొని విచారించిన తర్వాతనే సిమ్ కార్డులు అందజేయాలన్నారు.