హైదరాబాద్: నాచారం పారిశ్రామిక వాడ సమీపంలో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు సోమవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రెండు ట్యాంకర్ల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాచారం పారిశ్రామిక వాడకు సమీపంలోని హేమానగర్‌లో మహాలక్ష్మి ఆయిల్ పేరుతో ఉన్న గోదాములో పంతులు గోవిందరాజు, ప్రకాశరావు అనే వ్యక్తుల ఆధ్వర్యంలో కల్తీ ఆయిల్ తయారవుతోంది. వారు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ మడ్ ఆయిల్‌ను, కిరోసిన్‌ను కలిపి కల్తీ ఆయిల్‌ను తయారు చేసి, పరిశ్రమలకు విక్రయిస్తుంటారు.
తయారీకి అవసరమైన కిరోసిన్‌ను రఫీక్, బాలాగౌడ్ అనే వారు సమకూరుస్తుంటారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి గోదాముపై దాడులు చేశారు. అక్కడున్న గోవిందరాజు, ప్రకాశరావులను అదుపులోకి తీసుకున్నారు. రెండు ట్యాంకర్లలో ఉన్న 35వేల లీటర్ల కల్తీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ సహా ఇద్దరు వ్యక్తులను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై వెంకటయ్య కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.