ట్యాంకర్లు పేలడంతో భయంతో పరుగులు పెడుతున్న జనం
ఉప్పల్/బోడుప్పల్/మేడిపల్లి: శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయం.. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం.. భారీ శబ్దంతో డీజిల్ ట్యాంకర్ల పేలుడు.. ఏం జరిగిందో తెలిసేలోపే అర కిలోమీటర్ దూరం వ్యాపించిన అగ్నికీలలు.. రోడ్డు మీ ద ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారికి అంటుకున్న మంటలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం తాలూకూ విధ్వంసమిదీ. డీజిల్ ట్యాంకర్లు మరమ్మతు చేసే షెడ్‌లో రెండు ట్యాంకర్లు ప్రమాదవశా త్తూ పేలడం తో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ట్యాంకర్ల నుంచి అక్రమంగా పెట్రోల్, డీజిల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదాన్ని గమనించిన షెడ్ నిర్వాహకుడు, పనిచేసేవారు, ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లు అక్కడి నుంచి పరారవ్వగా.. దారినవెళ్లే అమాయకులు గాయాల పాలైనట్లు తెలుస్తోంది.
అదుపులో షెడ్ నిర్వాహకుడు..
షెడ్ నిర్వాహకుడు రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా డీజిల్ తీసిన తర్వాత సదరు ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు నిప్పురవ్వలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు.
క్షతగాత్రులకు గాంధీలో చికిత్స..
అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన ఆరుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేష్‌నాయక్(26)కు 80 శాతం కాలిన గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన స్వామినాయక్(35)కు 35 శాతం, మచిలీపట్నానికి చెందిన వాసుకు 25 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్పారు. చెంగిచర్లకు చెందిన గోల్డ్‌స్మిత్ నల్లా నాగులు(40), డ్రైవర్ మహ్మద్ జలీల్‌ఖాన్ (50), అంబర్‌పేట రతన్‌నగర్‌కు చెందిన టైలర్ షేక్ ఇబ్రహీం(60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మేడిపల్లి అపెక్స్ ఆస్పత్రిలో కుషాయిగూడకు చెందిన ఏఎస్‌ఐ మురళీదాస్‌గౌడ్(50), నవనీత్(28), చెంగిచెర్లకు చెందిన డొప్ప శివ(25) చికిత్సపొందుతున్నారు. వీ6 చానల్ రిపోర్టర్ శేఖర్, చెంగిచర్లకు చెందిన కేతావత్ లక్ష్మణ్(25) స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిందిలా..
ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి చౌరస్తా చెంగిచర్ల వెళ్లే రహదారి పక్కన డీజిల్ ట్యాంకర్లు మరమ్మతులు చేసే షెడ్డు ఉంది. మేడిపల్లికి చెందిన రాజు అనే వ్యక్తి పదేళ్లుగా ఈ షెడ్డును నిర్వహిస్తున్నాడు. అయితే అదే షెడ్‌లో డీజిల్, పెట్రోల్ విక్రయ అక్రమ దందాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరమ్మతుల పేరుతో ట్యాంకర్లను తీసుకొచ్చి వాటిలోని పెట్రోల్, డీజిల్‌ను తీసి డ్రైవర్లు, షెడ్డు నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ట్యాంకర్ నుంచి డీజిల్, పెట్రోల్ అక్రమంగా వెలికి తీసిన తర్వాత సదరు ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు నిప్పురవ్వలు అంటుకుని మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా రెండు డీజిల్ ట్యాంకర్లు పేలడంతో అర కిలోమీటర్ దూరం వరకు అగ్నికీలలు వ్యాపించాయి. షెడ్‌లో ఉన్న వారు బయటకు పరుగులు తీయగా.. రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఆరు ఫైరింజన్లు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ క్రమంలో ఫైర్ సిబ్బందికి కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 11 మందిని గాంధీ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొంప ముంచిన ఫొటోల సరదా..
ఇటీవల ప్రతీ ఘటనను తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించేందుకు ఎక్కువ మంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. చెంగిచర్ల అగ్ని ప్రమాద స్థలంలో దారిన వెళ్లే్ల వారు తమ వాహనాలను నిలిపి వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో డీజిల్ ట్యాంకర్ల ఒక్కసారిగా పేలడంతో మంటలు వ్యాపించి.. రోడ్డుపై ఉన్న ఆరుగురు అందులో చిక్కుకుపోయారు. బైక్‌లపై ఉండటంతో కొందరు తప్పించుకోలేకపోయారు. ఆరు ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. అర కిలోమీటర్ మేర మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న చెట్లు, మొక్కలు మాడి మసైపోయాయి.
ఇద్దరిని కాపాడా..
ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలియక పరుగులు తీశాం. హాహాకారాలు వినపడటంతో తేరుకుని చూస్తే.. రోడ్డుపై వెళ్లేవారు కాలిపోతున్నారు. వెంటనే టవల్‌తో మంటలార్పి ఇద్దరిని కాపాడాను. ఈ క్రమంలో నా చేతులు కాలిపోయాయి.
– కేతావత్ లక్ష్మణ్
Comments
Please login to add a commentAdd a comment