చెంగిచర్ల వద్ద ట్యాంకర్ పేలుడు.. ఇన్‌సెట్‌లో శివ(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద గత జనవరి 12న జరిగిన పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో తీవ్రంగా గాయపడిన చెంగిచర్లకు చెందిన శివకుమార్ నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెంగిచర్లకు శివకుమార్(25) చర్లపల్లిలోని హెచ్‌పీసీఎల్‌లో ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొబ్బరి కాయలు తెచ్చుకునేందుకు ఉప్పల్ వెళ్లిన అతను బైక్‌పై తిరిగి వస్తుండగా మేడిపల్లి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో శివకుమార్ బైక్, అతని ఒంటికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కొన్నాళ్ల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. శరీరంలో ఒక్కో అవయవం దెబ్బతినడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని షణ్ముక్ వైష్ణవి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షలు ఖర్చు కాగా నాలుగు నెలల పాటు మృత్యువుతో పోరాడిన శివకుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. శివ మృతితో అతని ఇంటి వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆస్పత్రి నిర్వాహకులు శివకుమార్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అతని ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment