దొంగల భరతం పట్టిన స్మార్ట్‌ఫోన్..
శంషాబాద్: స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం నేటి సమాజంలో పెరిగిపోయింది. ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్న ఫోన్లలోనే చూసుకుంటున్నాం. అదే స్మార్ట్‌ఫోన్ దొంగలనూ కూడా పట్టించగలదు. బాధితుడి నుంచి లాక్కున్న సెల్‌ఫోన్ ఈఎంఐ నంబరే ఆ నిందితులను పట్టించింది. ఓ దారిదోపిడీ కేసులో నిందితులను ఏ విధంగా పట్టుకున్నారో పోలీసులు వివరించారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లికి చెందిన సబావత్ నరేందర్‌నాయక్,విస్లావత్ రమేశ్‌నాయక్, భానుప్రకాష్, తిరుపతిరాజులు జల్సాల కోసం దొంగతనాలకు అలవాట్టుపడ్డారు.
ఈ క్రమంలో ఈ నెల 1 వ తేదీన వైఎస్‌ఆర్ జిల్లా పొద్దుటూరుకు చెందిన షేక్ షావలీ అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. తనకు రావాల్సిన రూ. 40 వేలు వసూలు చేసుకుని తిరిగి వెళ్లడానికి అదే రోజు రాత్రి ఆరాంఘర్ బస్ స్టాప్ వద్ద నిలబడి వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో కారులో వచ్చిన నలుగురు షావలీని ఎక్కడికి వెళ్లాలని అడిగారు. తామూ కుడా కడపకు వెళ్తున్నామని చెప్పి ఎక్కించుకున్నారు. పెద్దషాపూర్ సమీపంలోని బురజుగడ్డ తండా నిర్జన ప్రదేశంలో కారు ఆపి అతనిపై దాడి చేశారు.
అతని వద్ద ఉన్న రూ. 40వేల నగదు, స్మార్ట్‌ఫోన్ లాక్కుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు స్మార్ట్‌ఫోన్ ఐఎంఈ నంబర్ ఆధారంగా సిగ్నలింగ్‌పై నిఘా పెట్టారు. దీంతో ఉప్పల్‌కు చెందిన దిలీప్ వద్ద షావలీకి చెందిన మొబైల్ ఉన్నట్లు గుర్తించారు. దిలీప్‌ను అదుపులోకి తీసుకుని తీగ లాగితే దొంగల బండారం బయటపడింది. ఆ నలుగురు నిందితులు సెల్‌ఫోన్‌ను తనకు అమ్మినట్లు చెప్పాడు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతను చెప్పిన వివరాలు ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 40వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.