మహబూబ్‌నగర్: తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ ఇప్పించడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖమ్మంపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గోవిందమ్మ, మునెప్ప దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడైన పరశురాముడు(20) చదువుకోలేదు.
దీంతో రైతు కూలీగా పని చేసేవాడు. తన తోటి స్నేహితులతో స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయని, తనకు ఇప్పించాలని తల్లిదండ్రులను కోరాడు. ఇప్పుడు అవసరం లేదని మందలించారు. దీంతో మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు యువకుడిని గద్వాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
ఇద్దరికి అవయవదానం..
తాను మరణిస్తూ మరో ఇద్దరికి ప్రాణదాతగా నిలిచాడు పరశురాముడు. తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కళ్లు శుక్లాలను వైద్యులు సేకరించారు.
అదేవిధంగా కిడ్నీల టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబసభ్యులను అక్కడి వైద్యులు, గ్రామస్తులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే మరో పక్క అభినందించారు. తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment