
కట్టలు తెగిన నోట్లు
నగరంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది.
మూడు ప్రాంతాల్లో పోలీసులు కోటీ 20 లక్షల 72 వేల 680 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: నగరం నుంచి అర్ధరాత్రి వేళ భారీగా నగదును ముంబయికి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల బృందాన్ని నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బు ముంబయిలోని జవేరీ బజార్‌లో ఉన్న ఓ కంపెనీకి చెందినవని నిందితులు చెబుతున్నా అందుకు సంబంధించిన రశీదులు గాని, ఆధారాలు గాని చూపకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డి కథనం మేరకు.. నగరంలోని జాంబాగ్‌కు చెందిన నాగారం చౌదరి, జగదీష్ సోధా, గోపాల్ సి.ప్రజాపతి, తాన్ సింగ్‌లు సోమవారం అర్ధరాత్రి 2 గంటలు దాటాక ఇన్నోవా కారు (ఏపీ 11ఏఈ 0999లో రూ.60 లక్షల 29 వేల నోట్ల కట్టలను సంచుల్లో తరలిస్తున్నారు.
విధుల్లో నారాయణగూడ సబ్ ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ స్థానిక రెడ్డి కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండా జగదీష్ బృందం పోలీసుల కళ్లుగప్పి కారును రెడ్డి కళాశాల పక్క బజారులో నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు సదరు కారును ఆపి తనిఖీ చేయగా డబ్బులు కుక్కి ఉన్న రెండు సంచులు బయటపడ్డాయి.
ఈ నగదును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించగా.. డబ్బు తరలిస్తున్న వ్యక్తులను సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తులు పోలీసుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేసినట్లు తెలిసింది.
నాగోలు చౌరస్తాలో రూ.15 లక్షలు
నాగోలు చౌరస్తాలో మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.15 లక్షలు లభ్యమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సొత్తును సీజ్ చేశారు.