పశువుల దొంగల ఆట కట్టించారు.. | police chase cow thieves and dcm recovered | Sakshi
Sakshi News home page

పశువుల దొంగల ఆట కట్టించారు..

Published Wed, Aug 5 2015 3:51 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

పశువుల దొంగల ఆట కట్టించారు.. - Sakshi

పశువుల దొంగల ఆట కట్టించారు..

కడ్తాల (మహబూబ్‌నగర్ జిల్లా) : మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కడ్తాల వరకు పోలీసులు దొంగలను పట్టుకునేందుకు వాహనాలపై వెంబడించడంతో, దొంగలు వాహనాన్ని కడ్తాల పంచాయతీ పరిధిలోని అన్మాస్‌పల్లి అటవీ ప్రాంతంలో వదిలి పారిపోయారు. కల్వకుర్తి సీఐ వెంకట్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు పశువులను డీసీయంలో ఎక్కించుకున్నారు. వంగూరు మండలం తిప్పారెడ్డి పల్లిలో శ్రీపతిరావుకు చెందిన మరో ఆవును చోరీ చేసి హైద్రాబాద్‌కు బయలుదేరారు. రాత్రి ఒంటి గంట సమయంలో సమాచారం అందుకున్న కల్వకుర్తి సీఐ వెంకట్ దొంగలను పట్టుకునేందుకు ప్రధాన రహదారిపై ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారమిచ్చి అప్రమత్తం చేశారు.

వంగూర్ నుంచి కొట్ర, వెల్దండల మీదుగా దొంగల వాహనం రాఘయిపల్లి గేట్‌కు చేరుకోగానే, వెల్దండ పోలీసులు పశువుల దొంగల వాహనాన్ని నిలువరించడానికి ప్రయత్నించగా, ఆ వాహనం పోలీసులపైకి దూసుకొచ్చింది. డీసీఎం వాహనంలో వెనకాల నిలబడిన దొంగలు, పోలీసుల వాహనంపైకి తమ వెంట తెచ్చుకున్న రాళ్లు రువ్వడంతో జీపు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాఘయిపల్లి గేటు వద్ద తప్పించుకుని ముందుకు వెళ్లిన దొంగల వాహనాన్ని ఆమనగల్లు పట్టణం దాటుతుండగా, స్థానిక ఎస్సై సాయికుమార్ సిబ్బందితో కలిసి పోలీసు జీపులో వారిని వెంబడించారు.  హైద్రాబాద్ వైపు తిరిగి వెల్తుండగా, సాయికుమార్ కడ్తాల చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలు తమ వాహనాన్ని ఒక్కసారిగా అన్మాస్‌పల్లి రహదారి వైపు మళ్లించి, వీపరితమైన వేగంతో ముందుకు వెళ్లారు. ఆ తర్వాత డీసీఎం కనిపించకుండా పోయింది.

వాహనాన్ని వదిలి పారిపోయిన దొంగలు...
అన్మాస్‌పల్లి నుంచి కనిపించకుండా పోయిన దొంగల వాహనం జిల్లా సరిహద్దులో, అన్మాస్‌పల్లి అటవీ ప్రాంతంలో దొంగలు వదిలివేసి పారిపోయారు. బుధవారం ఉదయం వ్యవసాయపోలాలకు వచ్చిన రైతులు డీసీయం వాహనంలో ఎద్దు మృతి చెంది ఉండటం, సమీపంలోని వ్యవసాయ పొలంలో నాలుగు పశువులు కట్టివేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కల్వకుర్తి సీఐ వెంకట్, ఆమనగల్లు ఎస్సై సాయికుమార్, వెల్దండ ఎస్సై జానకీరాంరెడ్డిలు వెంటనే డీసీయం వాహనం ఉన్న ప్రదేశానికి చేరుకుని, వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, పరిసర ప్రాంతాలను తనిఖీ చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ తెలిపారు. వాహనాన్ని, పశువులను కల్వకుర్తి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement